Ramoji Rao: రామోజీ రావు మృతికి టాలీవుడ్ నివాళి.. ఆదివారం సినిమా షూటింగ్స్ బంద్..

|

Jun 08, 2024 | 2:46 PM

రామోజీ రావు మృతి పట్ల దేశ ప్రధాని, తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. రామోజీ రావు మృతి పట్ల టాలీవుడ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.

Ramoji Rao: రామోజీ రావు మృతికి టాలీవుడ్ నివాళి.. ఆదివారం సినిమా షూటింగ్స్ బంద్..
Ramoji Rao
Follow us on

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు కన్నుముశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామోజీ రావు మృతి పట్ల దేశ ప్రధాని, తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. రామోజీ రావు మృతి పట్ల టాలీవుడ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, నటీనటులు, నిర్మాతలు ఆయన పార్దివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి, ఎంఎం కీరవాణి, రాజేంద్రప్రసాద్ ఆయన పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే గేమ్ ఛేంజర్ షూటింగ్ సెట్‏ నుంచి డైరెక్టర్ శంకర్, హీరో రామ్ చరణ్‏తోపాటు చిత్రయూనిట్ సభ్యులు రామోజీ రావు మృతికి నివాళి అర్పిస్తూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

అలాగే రామోజీ రావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేసింది. సంతాప సూచికంగా ఆదివారం (జూన్ 9న) సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. రేపు సినిమా షూటింగ్స్ కు సెలవు అని ప్రకటించారు. రామోజీరావు పార్ధీవ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఉంచారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత నివాళులర్పించారు.

ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహనీయులు రామోజీ రావు అని అన్నారు దర్శకుడు రాజమౌళి. ఆయన చేసిన సేవలకు గానూ భారత రత్న ఇచ్చి గౌరవించుకోవాలని ఎమోషనల్ అయ్యారు. రామెజీ రావు మరణవార్త తనను ఎంతగానో బాధించిందని అన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. జర్నలిజం, సినిమా రంగాల్లో ఆయన చరిత్ర సృష్టించారని, రాజకీయాల్లో ఆయన కింగ్ మేకర్ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.