
ప్రముఖ నటుడు డా. రాజశేఖర్ ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో తెలియని ఆసక్తి ఉండేది. ఇటీవల కాలంలో రాజశేఖర్ హీరోగా కాకూండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తున్నారు. మొన్నామధ్య నితిన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ మూవీలో హీరో తండ్రిగా నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు ఈ సీనియర్ హీరో. అయితే రాజశేఖర్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన కొన్ని ముఖ్యమైన సంఘటనలను, సహనటులతో తనకున్న అనుబంధాన్ని, అలాగే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఎలా మిస్ అయ్యాయో కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రాజశేఖర్ మాట్లాడుతూ, ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారితో స్నేహం కోసం చిత్రంలో నటించే అవకాశం గురించి ప్రస్తావించారు. ఆ సినిమాలో విజయకుమార్ గారు పోషించిన పాత్రను తాను చేయాలని చిరంజీవి గారిని అడిగానని రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. అయితే, చిరంజీవి గారు “రాజశేఖర్, నువ్వు వయసులో కొంచెం చిన్నవాడివి కాబట్టి ఆ పాత్రకు సూట్ అవ్వకపోవచ్చు” అని సలహా ఇచ్చారని, అది సరైన నిర్ణయమేనని తాను అంగీకరించానని తెలిపారు రాజశేఖర్.
అలాగే, నందమూరి బాలకృష్ణ గారితో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను కూడా రాజశేఖర్ వెల్లడించారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ గారు నటించిన జై సింహా సినిమాకు సంబంధించి బాలకృష్ణ గారు తనను అడిగారని తెలిపారు. బాలయ్య బాబు గారు స్వయంగా “బ్రదర్, నీకు ఏం కావాలో చెప్పు. ఈ ఫైట్ సీన్స్ కూడా ఈక్వల్‌గా పెట్టుకుందాం, నో ప్రాబ్లం” అంటూ తనను బాగా ఎంకరేజ్ చేశారని రాజశేఖర్ వివరించారు. అయితే, బాలకృష్ణతో చేయాల్సిన మొదటి సినిమా అది కాదని, దానికంటే మెరుగైన సినిమాను తామిద్దరం కలిసి చేయాలని నిర్ణయించుకున్నామని, అందుకే ఆ అవకాశాన్ని వదులుకొని, భవిష్యత్తులో వేరే సినిమా చేద్దామని మాట్లాడుకున్నామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.