
టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. . సిందూరం, డ్రింకర్ సాయి తదితర సినిమాల్లో నటించిన ఈ యంగ్ హీరోపై అతని భార్య గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ధర్మ మహేష్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గౌతమి ధర్మ మహేష్ పై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె, తన భర్త తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆరోపించింది. ఇన్నాళ్లూ మౌనంగా భరించానని, కానీ ఇకపై సహించేది లేదని వాపోయింది. ‘ ధర్మ మహేశ్ సినిమాల్లోనే హీరో, కానీ నిజ జీవితంలో విలన్. హీరో అయ్యాకే అతని విశ్వరూపం తెలిసింది. అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వచ్చేవాడు. నేను నిండు గర్బంతో ఉన్నప్పుడు చంపేందుకు ప్లాన్ చేశాడు. అలాగే పిల్లాడు పుట్టిన తర్వాత కొడుకుగా అంగీకరించలేదు. కానీ నా డబ్బు, నా హోటల్స్ మీద వచ్చే లాభాలు మాత్రం తీసుకుంటాడు.
‘మహేష్ కే కాదు అతని కుటుంబం మొత్తానికి డబ్బంటే పిచ్చి. వాళ్లు వందల కోట్ల వరకట్నం కావాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బు కోసం నన్ను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఇన్నాళ్లు నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నా.. ఇక నావల్ల కాదు! అతని హింస భరించలేక పోలీసులను ఆశ్రయించాను. ధర్మ మహేశ్‌కు పోలీసులంటే అసలు లెక్కలేదు. ఇంతవరకు విచారణకు రకూడా హాజరు కాలేదు. పైగా నన్ను, నా కుటుంబాన్ని గన్ తో కాల్చేస్తానంటూ బెదిరిస్తున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేసింది గౌతమి.
ధర్మ మహేశ్, గౌతమి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. గతంలోనే మహేశ్‌పై వరకట్న వేధింపుల ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు కూడా తెలుస్తోంది. అయితే మహేష్ ధోరణిలో మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి భార్యను వేధింపులకు గురిచేసి వార్తల్లో నిలిచాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.