
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పుట్టి పెరిగిందీ అందాల తార. చిన్నప్పటి నుంచే చుదువులో చురుకుగా ఉండడంతో తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించారు. ఇదే క్రమంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని ప్రవర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మెడిసిన్ పూర్తి చేసింది. అన్నట్లు ఈ నటి జాతీయస్థాయి అథ్లెట్. కోకో, బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాల కూడా గెల్చుకుంది. అంతేకాదు క్లాసికల్ నృత్య కళాకారిణి కూడా. మెడిసిన్ పూర్తయ్యాక న్యూయార్క్ వెళ్లి మాస్టర్స్ కూడా పూర్తి చేద్దామనుకుంది. అదే సమయంలో అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. దీంతో మాస్టర్స్ అప్లికేషన్ కూడా చింపేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇటీవలే నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ హిట్3 లోనూ ఎస్పీ వర్షా గా ఓ కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. తను మరెవరో కాదు కోమలి ప్రసాద్.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే కోమలి ప్రసాద్ లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. వైట్ కోట్ ధరించి డెంటిస్ట్ గా మారినట్టు ఫొటోలు షేర్ చేస్తూ..’ అందరూ స్వచ్ఛమైన స్మైల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కోమలి ప్రసాద్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు ఈ పోస్ట్ ద్వారా డెంటిస్ట్ గా కోమలి ప్రసాద్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిందని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చింది. డాక్టర్ యాప్రన్‌తో తాను దిగిన ఫోటోల ద్వారా తప్పుడు సమాచారం ఇంటర్నెట్‌లో ప్రచారం అవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని పేర్కొంది. శివుని కృపతో తనకు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని.. ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్న యాక్టింగ్ ప్రోఫిషన్‌కు తాను ఎప్పటికీ దూరం కావట్లేదని కోమలి ప్రసాద్ స్పష్టం చేసింది.
2016లో సీతాదేవి సినిమాలో ఎంట్రీ ఇచ్చింది కోమలి ప్రసాద్. ఆ తర్వాత నెపోలియన్, అనుకున్నది ఒకటి అయినది మరొకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ పీసీ 524, హిట్-2, హిట్-3 తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్ని తమిళ సినిమాల్లోనూ తళుక్కుమంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..