మూవీ రివ్యూ: టిల్లు స్క్వేర్
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ, ప్రిన్స్ తదితరులు
సంగీతం: రామ్ మిర్యాల, అచ్చు, భీమ్స్
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్, ఉమ్మడి సింగు
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: మల్లిక్ రామ్
సిద్దు జొన్నలగడ్డకు డీజే టిల్లుతో ఎంత మంచి పేరు వచ్చిందన్న ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడకు వెళ్లినా డీజే టిల్లుగానే గుర్తిస్తుంటారు. అంతలా డీజే టిల్లు పాత్ర అందరి మీద ముద్ర వేసింది. అలాంటి పాత్ర, కారెక్టరైజేషన్‌ను నమ్ముకుని టిల్లు స్క్వేర్ అనే సినిమాను తీశారు. మరి ఈ టిల్లు స్క్వేర్ మూవీ ఎలా ఉంది? ఆడియెన్స్‌కు ఏ మేరకు ఎక్కేస్తుంది? అన్నది చూద్దాం.
కథ :
రాధిక పార్ట్ తరువాత టిల్లు గాడి లైఫ్ హాయిగా సాగుతుంటుంది. టిల్లు ఈవెంట్స్ అని పెట్టి బాగానే సందడి చేస్తుంటాడు. అలాంటి టిల్లు గాడి లైఫ్‌లోకి లిల్లీ (అనుపమ) వస్తుంది. వచ్చీ రావడంతో ప్రేమ మత్తులో ముంచేసి మాయం అవుతుంది. ఆమె కనిపించక నెల రోజుల పాటు టిల్లు అదోలా అయిపోతాడు. ఓ సారి సడెన్‌గా ప్రత్యక్షం అవుతుంది. తాను ప్రెగ్నెంట్ అని షాక్ ఇస్తుంది. ఆమెను ప్రేమించిన టిల్లు కాస్త షాక్‌లోనే ఉంటూ తండ్రిగా అంగీకరిస్తాడు. అసలు టిల్లు జీవితంలోకి లిల్లీ ఎందుకు వచ్చింది? ఆమె లక్ష్యం ఏంటి? ఆమె అసలు రూపం ఏంటి? ఈ కథలో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా లీడర్ షేక్ మొహబూబ్ (మురళీ శర్మ) పాత్ర ఏంటి? అన్నది కథ.
నటీనటులు :
టిల్లు పాత్రలో సిద్దు మరోసారి నవ్వించేశాడు. ఇక ఈ పాత్రను సిద్దు ఎంతో అవలీలగా, ఎంతో ఈజ్‌తో ఈజీగా చేసేశాడు. సిద్దు నటనకు, డైలాగ్స్‌కు అందరూ నవ్వాల్సిందే. మరోసారి టిల్లు మ్యాజిక్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక అనుపమ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె పాత్రల్లో కనిపించే వేరియేషన్స్, తెరపై చేసిన రొమాన్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కాల్సిందే. తండ్రిగా కనిపించిన మురళీధర్ గౌడ్ మరోసారి తన పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. ప్రిన్స్, అనీష్ కురివిల్లా పాత్రలు అలా వస్తూ వెళ్తాయి. మురళీ శర్మ పాత్ర గెస్ట్‌గా అనిపిస్తుంది.
విశ్లేషణ :
టిల్లు స్క్వేర్ సినిమా కోసం కొన్ని ట్విస్టులు, టర్న్స్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంలో ఇలా కథను రాసుకున్నారనిపిస్తోంది. డీజే టిల్లులో పెద్ద ట్విస్టులేమీ కనిపించవు. ఏదో అలా సరదా సరదాగా సాగుతుంటుంది. కానీ టిల్లు స్క్వేర్‌లో మాత్రం ఊహించని ట్విస్టులు వస్తుంటాయి. క్లైమాక్స్‌లో అందరూ షాక్ అయ్యేలా ట్విస్ట్ ఉంటుంది. ఇందులో హీరో.. మాస్ కమర్షియల్ హీరోలా కనిపించడు.. హీరోయిన్.. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌గా కనిపించదు.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా అలా హాయిగా, జాలీగా సాగుతుంటుంది. ఎక్కడా బోర్ కొట్టే సన్నివేశం ఉండదు. కామెడీ, రొమాన్స్ అంటూ ఇలా బ్యాక్ టు బ్యాక్ సీన్లుంటాయి. ఇంటర్వెల్‌కు ఓ ట్విస్ట్ వస్తుంది. ఆ తరువాత సెకండాఫ్ కూడా అలానే సరదా సరదాగా సాగుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌లో నేహా శెట్టి ఎంట్రీ.. క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్టులు సినిమాకు అదనపు బలంగా మారుతాయి.
సాంకేతికంగానూ ఈ మూవీ మెప్పిస్తుంది. రామ్ మిర్యాల, అచ్చు, భీమ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. థియేటర్లో పాటలు మోత మోగిపోతాయి. భీమ్స్ ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. కెమెరా వర్క్ ఫ్రెష్‌గా, రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. తక్కువ నిడివి కావడం మరో ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.