Upcoming Movies: జూన్ నెలలో విడుదల కానున్న సినిమాలు ఇవే.. నెలంతా వినోదాల జాతరే..
ఈనెలలో మరిన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. జూన్ 10న న్యాచురల్ స్టార్ నాని, నజ్రీయా నజీమ్ జంటగా నటించిన అంటే సుందరానికీ విడుదల కానుంది.
థియేటర్లకు పూర్వ వైభవం వచ్చేసింది. కరోనా సంక్షోభంతో కళ తప్పిన థియేటర్లు ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ మొదలైంది. గత కొద్ది రోజులుగా వరుస సినిమాలన్నీ వరుసపెట్టి విడుదలవుతున్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు విడుదలై ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వేసవిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేయగా.. ఇప్పుడు జూన్ నెలలోనూ మరిన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు రిలీజ్ అయి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్నాయి. మేజర్, విక్రమ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఇక ఈనెలలో మరిన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. జూన్ 10న న్యాచురల్ స్టార్ నాని, నజ్రీయా నజీమ్ జంటగా నటించిన అంటే సుందరానికీ విడుదల కానుంది. అలాగే సురాపానం , జరిగిన కథ, 777 చార్లీ, జురాసిక్ వరల్డ్ డొమీనియన్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. 17వ తేదీన గాడ్సే, విరాటపర్వం, కన్నడ డబ్బింగ్ మూవీ కే3 సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన వాశి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జూన్ చివరి వారంలో అంటే 23న కొండా సినిమా విడుదల కానుంది. అలాగే.. 24న కిరణ్ అబ్బవరం నటిస్తోన్న సమ్మతమే.. 7 డేస్ 6 నైట్స్, ఒక పథకం ప్రకారం, గ్యాంగ్ స్టర్ గంగరాజు , టెన్త్ క్లాస్ డైరీస్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇవే కాకుండా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న చిత్రాలు సైతం జూన్ చివరి వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.