
లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్‌కి ఎప్పుడూ ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సొసైటీలో ఎక్కువగా ప్రేమలు విఫలమవుతూ ఉంటాయి కనుక. కొందరు కాలంలో పాటు ప్రేమించి దూరమయిన వారిని మర్చిపోయి ముందుకు సాగుతూ ఉంటారు. మరికొందరు జీవితంలోకి వేరే వాళ్లు వచ్చినా.. తమ ఎక్స్‌లను మర్చిపోకుండా వారి జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉంటారు. అయితే లవ్ ఫెయిల్యూర్స్ అందరూ ఎక్కువగా ఇష్టపడే.. పదే, పదే వినే ఓ బ్రేకప్ సాంగ్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. అదే అటు నువ్వు.. ఇటు నువ్వే సాంగ్. నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా.. స్నేహా ఉల్లాల్ హీరోయిన్‌గా నటించిన కరెంట్ చిత్రంలోనిది ఈ పాట. మూవీ 2009లో వచ్చింది. కానీ అప్పటికీ.. ఇప్పటికీ సాంగ్‌కి ఉన్న ఆదరణ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు బ్రేకప్ సాంగ్స్‌లో దీనికి ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పెద్ద హంగులు లేకుండా, మృదువైన భావాలతో ప్రేమను చెప్పిన పాటగా ఇది ఆడియెన్స్ మనసుల్లో నిలిచిపోయింది. ఈ పాటకు సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్. ప్రేమలోని తీయదనాన్ని, మౌనాన్ని సంగీతంగా మలిచిన విధానం ఈ సాంగ్‌కు ప్రధాన ఎస్సెట్ అని చెప్పాలి. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం గురించి చెప్పేది ఏముంది. సాధారణ మాటల్లోనే లోతైన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన మనసులను మీటుతారు. ఈ పాటను హృదయాలు మెలిపెట్టేలా పాడినది నేహా భాసిన్. ఆమె గొంతులోని సాఫ్ట్ టచ్ పాటకు మరింత ప్రాణం పోసింది. పాట మొదలైన క్షణం నుంచే శ్రోతను ఒక ప్రేమభావనలోకి తీసుకెళ్లేలా గానం సాగుతుంది.
విజువల్స్ పరంగా చూస్తే.. సుశాంత్‌లోని అమాయకమైన ప్రేమ, స్నేహా ఉల్లాల్‌లోని సహజమైన భావోద్వేగం పాటకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. మాటలు చెప్పకుండానే కళ్లతో ప్రేమను పలికించిన తీరు ఈ గీతాన్ని మరింత గుర్తుండిపోయేలా చేసింది.
కాలం మారినా, ట్రెండ్లు మారినా.. ప్రేమను సింపుల్‌గా, స్వచ్ఛంగా చూపించిన పాటగా “అటు నువ్వే.. ఇటు నువ్వే” ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో అలాగే నిలిచిపోయింది.