
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు భారీగా ప్రోత్సాహక నగదు అందనుంది. నంది అవార్డుల కంటే భారీగా ప్రోత్సాహక నగదును పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీని ప్రకారం ఒక్కో ఉత్తమ చిత్రానికి అవార్డుతోపాటు రూ.10 లక్షల ప్రోత్సాహక నగదు అందనుంది. వ్యక్తిగత అవార్డుల్లోనూ ఒక్కో అవార్డుకు రూ. 5 నుంచి రూ.3 లక్షల చొప్పున నగదు అందనుంది. అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డు కు రూ.10 లక్షల ప్రోత్సాహక నగదు లభించనుంది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా మొత్తం 73 అవార్డులను తెలంగాణ ప్రభుత్వం అదించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.4.5 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ క్రమంలో మొత్తం 11 ఉత్తమ చిత్రాలకు గానూ, ఒక్కో చిత్రానికి రూ.10 లక్షలు, రెండో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి రూ.7 లక్షలు, మూడో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించనున్నారు. సుమారు రూ. 25 కోట్లతో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు.
కాగా ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. సుమారు 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను అందించనుంది. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో 2024 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ అవార్డుల్లో ‘పుష్ప 2’ చిత్రానికి గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే ప్రభాస్ కల్కి ఉత్తమ చిత్తంగా నిలిచింది. అలాగే నివేదా థామస్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు, చిత్రాలకు గద్దర్ అవార్డుల్లో స్థానం దక్కింది.