Suriya: చిన్నప్పుడు ఆ తెలుగు నటుడి ఇంట్లో దొంగతనం చేసిన సూర్య.. హెల్ప్ చేసిన కార్తీ.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో వీరభద్రుడిగా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించగా, హీరో సూర్య ఒక ఆసక్తికర విషయం బయటపెట్టాడు.

తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. వీరు నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజవుతుంటాయి. అలా ప్రస్తుతం సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాలో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్స్, గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను విస్తృతంగా చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా సోమవారం (మే11) కరుప్పు చిత్ర బృందం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సూర్యతో పాటు ఆయన తమ్ముడు కార్తీ కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఒకే వేదికపై అన్నదమ్ములు కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
వీరభద్రుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించింది. ఈ సందర్భంగా సుమ కనకాల అడిగిన సరదా ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సూర్య తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పుడు తాను, కార్తీ కలిసి చేసిన ఓ అల్లరి పని గురించి చెప్పి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు.. ‘మేం చిన్నప్పుడు తెలుగు నటుడు నూతన్ ప్రసాద్ గారి ఇంటి పక్కనే ఉండేవాళ్లం. వాళ్లింట్లో పెద్ద మామిడికాయ చెట్టు ఉండేది. మా ఇంటి సన్ షేడ్ ఎక్కి వాళ్ల ఇంట్లోకి దూకి మామిడికాయలు దొంగతనం చేసేవాళ్లం. నేను పైకి ఎక్కేందుకు కార్తీ సహాయం చేసేవాడు. మామిడికాయలు తెచ్చాక వాటిని భాగాలు వేసుకునేప్పుడు ఎవరికి ఎక్కువ రావాలనే విషయంలో ఇద్దరం గొడవపడేవాళ్లం’ అని చిన్నప్పటి క్షణాలను గుర్తు తెచ్చుకున్నాడు సూర్య.
సూర్య చెప్పిన ఈ మాటలు విని అక్కడున్నవాళ్లందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఇక వీరభద్రుడు సినిమా విషయానికి వస్తే.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం సమకూర్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




