Happy Birthday Superstar Krishna: సినీ ఇండస్ట్రీని నటశేఖరుడై ఏలిన మహనీయుడు సూపర్ స్టార్ కృష్ణ..

నేడు సూపర్ స్టార్ జయంతి. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులుతో సూపర్ హిట్ అందుకున్నారు.

Happy Birthday Superstar Krishna: సినీ ఇండస్ట్రీని నటశేఖరుడై ఏలిన మహనీయుడు సూపర్ స్టార్ కృష్ణ..
Krishna

Updated on: May 31, 2023 | 8:03 AM

సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పేరు ఆయనది. బుర్రిపాలెం నుంచి వచ్చి తెలుగు కళామ్మతల్లి ముద్దుబిడ్డగా మారారు కృష్ణ. నేడు సూపర్ స్టార్ జయంతి. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులుతో సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే ఆయన మూడవ సినిమా గూఢచారి 116 కృష్ణ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి సహాయపడింది. ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించారు. ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు కు పోటీగా నిలబడి ప్రేక్షాదరణ పొందారు కృష్ణ . ఇక కృష్ణ సాధించిన ఘనతలు అన్ని ఇన్ని కావు.

. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి. 1984 నుంచి కాంగ్రెస్ సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు చేశాడు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు.

కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయనిర్మలను 1969లో ప్రేమించి రెండవ పెళ్ళి చేసుకున్నాడు. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి. 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు, 1975లో 8 సినిమాలు విడుదలయ్యాయి. ఈ దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల చొప్పున విరామం ఎరుగక సినిమాలు చేయడం ప్రారంభించారు సూపర్ స్టార్. నవంబర్ 15 2022లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీతో పాటు అశేష అభిమానులు విషాదంలో మునిగిపోయారు.