
తన ప్రత్యేకమైన కథా ఎంపికలు, శక్తివంతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, తన ఆరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదలైన అద్భుతమైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. గతంలో వీరి కలయికలో వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్ కోసం సన్నద్ధమవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తన ప్రత్యేకమైన కథన శైలితో గుర్తింపు పొంది, తెలుగు చిత్ర సీమలో ప్రతిభగల యువ దర్శకులలో ఒకరిగా పేరుగాంచిన స్వరూప్ ఆర్‌ఎస్‌జే.. ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క కథ, కథనం మరియు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అద్భుతమైన కథాకథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు.
ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డను కొత్తగా, గాఢమైన, అదే సమయంలో వినోదాత్మకమైన అవతారంలో చూడబోతున్నాము. నిరంతరం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంలో పేరుగాంచిన సిద్ధు జొన్నలగడ్డ, నటుడిగా తనను సవాలు చేసే కథలను ఎంచుకోవడంలో మరియు ప్రేక్షకులను మరింత లోతుగా ఆకట్టుకోవడంలో తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.