Tollywood : ఈసీ మీటింగ్‌లో నిరసన గళమెత్తిన నిర్మాతలు.. ఎలక్షన్స్ కావాలంటూ రచ్చ

ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త రచ్చ మొదలైంది. అది కూడా కీలకమైన నిర్మాతల మండలిలో!. సి.కల్యాణ్‌కి వ్యతిరేకంగా ఈసీ మీటింగ్‌లో గళంవిప్పారు చిన్న నిర్మాతలు.

Tollywood : ఈసీ మీటింగ్‌లో నిరసన గళమెత్తిన నిర్మాతలు.. ఎలక్షన్స్ కావాలంటూ రచ్చ
Tollywood

Updated on: Jan 04, 2023 | 8:17 PM

ఏదోఒక సమస్య టాలీవుడ్‌లో హీట్‌ పుట్టిస్తోంది. ఏడాదిక్రితం మా ఎన్నికలతో మొదలైన రగడ, ఆ తర్వాత టికెట్ల ధరలు, థియేటర్స్‌ ఇష్యూస్‌ కాకరేపాయ్‌. ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త రచ్చ మొదలైంది. అది కూడా కీలకమైన నిర్మాతల మండలిలో!. సి.కల్యాణ్‌కి వ్యతిరేకంగా ఈసీ మీటింగ్‌లో గళంవిప్పారు చిన్న నిర్మాతలు. ఇంతకీ, చిన్న నిర్మాతల ఆగ్రహానికి కారణమేంటి?. ఈసీ మీటింగ్‌లో అసలేం జరిగిందంటే..

టాలీవుడ్‌లో చిన్న నిర్మాతలు ఏకమయ్యారు. నిర్మాతల మండలి ఎలక్షన్స్‌ కోసం గళం విప్పారు. రెండేళ్లు ఓపిక పట్టాం, ఇక ఆగేదే లేదంటూ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో సి.కల్యాణ్‌ను కడిగిపారేశారు నిర్మాతలు. వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా? ఏదో ఒకటి తేల్చిచెప్పాలంటూ రచ్చరచ్చ చేశారు. ఊహించనివిధంగా చిన్న నిర్మాతలంతా గళమెత్తడంతో దెబ్బకు దిగొచ్చారు సి.కల్యాణ్‌. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామంటూ అప్పటికప్పుడు ఓ డేట్‌ ప్రకటించారు.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ తరహాలోనే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కూడా రెండేళ్ల పదవీకాలానికి అధ్యక్షుడ్ని ఎన్నుకుంటుంది. అలా, 2019లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సి.కల్యాణ్‌ పదవీకాలం 2021లో ముగిసింది. అంటే, 2021లో నిర్మాతల మండలి ఎలక్షన్స్‌ జరగాల్సి ఉంది. కానీ, 2023 వచ్చినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై చిన్న నిర్మాతలు రివర్స్‌ అయ్యారు. రెండేళ్లు ఆగాం, ఇక ఆగలేమంటూ సి.కల్యాణ్‌పై తిరుగుబాటు జెండా ఎగరేశారు. పదవీకాలం ముగిసి రెండేళ్లయినా ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ నిలదీశారు. దాంతో, సి.కల్యాణ్‌, చిన్న నిర్మాతల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇరువర్గాల వాగ్వాదంతో ఈసీ మీటింగ్‌ కాస్త రచ్చరచ్చయ్యింది. వాగ్వాదం కాస్తా వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. నువ్వో యూజ్‌లెస్‌ ప్రెసిడెంట్‌ అంటూ సభ్యులు, మీరు పనికిరాని మెంబర్స్‌ అంటూ సి.కల్యాణ్‌… ఒకరినొకరు తిట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చింది నిర్మాతల మండలి కార్యవర్గం. అయితే, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా? మరి ఎన్నికలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నిస్తున్నారు చిన్న నిర్మాతలు. ప్రస్తుత కార్యవర్గ సభ్యులు కూడా ఎదురుతిరగడంతో ఫిబ్రవరి 26న ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రకటించారు సి.కల్యాణ్‌. అయితే, ఈ డేట్‌పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటికప్పుడు ఈసీ మీటింగ్‌లో డేట్‌ అనౌన్స్‌ చేసినా, అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరి, నిర్మాతల మండలి మీటింగ్‌లో చెప్పినట్టుగా ఫిబ్రవరి 26న ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ఏదోఒక రీజన్‌తో మళ్లీ వాయిదా వేస్తారా?. ఏమో ఎన్నికలు జరిగేవరకూ డౌటే అంటున్నారు చిన్న నిర్మాతలు.