sirivennela seetharama sastry passes Away: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యూమోనియాకు చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన.. ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కాగా సినీ పరిశ్రమలో 3000లకు పైగా పాటలు రాశారు.. పదకొండు నంది అవార్డ్స్.. పద్మ శ్రీ అవార్డ్ అందుకున్నారు. సిరివెన్నెల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.
వాన బొట్టు ఆల్చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది..అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది అలా సాక్షాత్తు సరస్వతీ దేవి తెలుగు తెరకు అందించిన అపురూప ఆణిముత్యం సీతారామశాస్త్రీ తన తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రీ ప్రస్థుతం తెలుగు సినిమా సాహిత్యానికి పెద్దదిక్కు.
ఆయన కలం అన్ని భావాలను అవలీలగా పలికిస్తుంది.. సిరివెన్నెల గారి పాటల్లో జీవిత సత్యాలు ఆలోచింప చేస్తాయి కొత్త జీవన మార్గాన్ని చూపిస్తాయి.. కోటీశ్వరున్ని కూటికి గతిలేని వాన్ని ఒకే బండి ఎక్కిస్తాయి.. ఒకే గమ్యాన్ని చేరుస్తాయి..
సీతారామశాస్త్రీ పాటలలో బరువైన పద ప్రయోగాలు ఆకట్టుకుంటాయి.. మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయాజారాకా అన్న పదం ఆయన తప్ప ఇంకెవరు రాయగలరు.. అందుకే ఆయన తెలుగు సినిమా సాహిత్యాన్ని శాసించగలిగారు. భారీ పద ప్రయోగాలు బరువైన మాటలే కాదు ఆయన చిన్న చిన్న పదాలతో ఈ తరానికి అర్ధమయ్యేలా అలరించేలా కూడా పాటలు రాశారు. ఖడ్గం సినిమాలో ఆయన రాసిన ముసుగువేయోద్దు మనసు మీద అన్నపాటలో ఎంత ఆధునికత ఉందో అంతే జీవిత సత్యం కూడా ఉంది..