ఇండియన్ సినిమాలో మ్యూజిక్ మ్యాస్ట్రోగా పేరుగాంచిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, గాయని భవతారిణి హఠాన్మరణం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. 40 ఏళ్లు వయసులోనే భవతారిణి ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. గత కొన్ని నెలలుగా భవతారిణి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో భవతారిణి మృతి చెందారు. ఆమె మృతికి తమిళ సినీ పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
గత కొన్ని రోజులుగా భవతారిణి శ్రీలంకలో చికిత్స పొందుతున్నారు. అక్కడ జనవరి 25వ తేదీ రాత్రి మరణించారు. ఆమె భౌతికకాయాన్ని చివరి దర్శనం కోసం చెన్నైలో ఉంచనున్నారు. భవతారిణి మృతితో సింగర్ చిత్ర ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. “శ్రీమతి భవతారిణి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని రాసుకొచ్చారు.
భవతారిణి స్వయంగా అద్భుతమైన గాయని. ఎన్నో తమిళ పాటలు పాడిన భవతారిణి ‘భారతి’ సినిమాలోని పాటకు జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. సుబ్రహ్మణ్య భారతి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అంతే కాకుండా భవతారిణి తన మధురమైన గానానికి ఎన్నో రాష్ట్ర అవార్డులు కూడా గెలుచుకుంది. భవతారిణి మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్ చేస్తూ.. ‘భవతారిణి మరణంతో ఏర్పడిన శూన్యతను ఎవరూ పూరించలేరు’ అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.