నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరె
సిల్క్ స్మిత, అసలు పేరు విజయలక్ష్మి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అగ్రతారగా ఎదిగిన దక్షిణ భారత సంచలనం. ఎన్నో కష్టాలు, తిరస్కరణలు ఎదుర్కొని తనదైన శైలిలో నర్తకిగా, నటిగా గుర్తింపు పొందింది. అయితే ప్రేమలో మోసపోయి, మానసిక వేదనకు గురై 35 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు పాల్పడి విషాదంగా ముగిసిన ఆమె జీవితం డర్టీ పిక్చర్ చిత్రానికి ప్రేరణ.

కొందరు తారల జీవిత గాథలు నమ్మశక్యం కానివిగా అనిపిస్తాయి. నిరుపేదరికం నుంచి అగ్రతార స్థాయికి ఎదిగి, చివరికి విషాదాంతమైన జీవితం సిల్క్ స్మితది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. 1960 డిసెంబర్ 2న ఏలూరు దగ్గర ఉన్న కొవ్వలి గ్రామంలో శ్రీరామమూర్తి, నరసమ్మ దంపతులకు జన్మించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో అన్నపూర్ణమ్మ దత్తత తీసుకోవడంతో ఆమె మకాం ఏలూరుకి మారింది. సినిమాలంటే చిన్నప్పటి నుంచీ విపరీతమైన ఆసక్తి ఉన్న విజయలక్ష్మి, సినీరంగంలో రాణించాలనే కోరికతో 18 ఏళ్ల వయసులో తల్లిని వెంటబెట్టుకుని మద్రాస్ చేరుకుంది. మద్రాస్‌లో ఆమెకు ఎదురైన అనుభవాలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవి. దర్శక నిర్మాతల చుట్టూ తిరిగి అవకాశాల కోసం అభ్యర్థించినా, ఆమెలో గ్లామర్ లేదని, నటిగా పనికిరాదని ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొంది. నల్లగా, బొద్దుగా ఉండటం, చక్కగా మాట్లాడలేకపోవడం ఆమెకు ప్రతికూల అంశాలుగా మారాయి. చాలామంది ఆమెను ఇంటికి తిరిగి వెళ్లిపోమని సలహా ఇచ్చారు. కానీ విజయలక్ష్మి పట్టుదల వదలలేదు. చావో రేవో మద్రాస్‌లోనే అని నిశ్చయించుకుని, తన పేరును “విజయ”గా కుదించుకుని జూనియర్ ఆర్టిస్ట్‌గా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. సరిగ్గా ఆ సమయంలోనే మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఆమెకు అవకాశం వచ్చింది. అందాలు ఆరబోసే పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే మలయాళ చిత్రాల్లో నటించడానికి విజయ మొదట సంశయించినా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. విలువలతో పాటు వలువలు వదిలేసింది. ఆమె ధైర్యం ఫలించింది. తొలి మలయాళ చిత్రంతోనే విజయ అందరినీ ఆకట్టుకుంది.
విజయ నుంచి సిల్క్ స్మితగా పేరు మార్పు
తదనంతరం తమిళ చిత్ర పరిశ్రమ దృష్టి ఆమెపై పడింది. తమిళంలో విజయ నటించిన తొలి చిత్రం “వండి చక్రం”. ఈ చిత్రంతో ఆమె జాతకమే మారిపోయింది. “సిల్క్ స్మిత”గా పేరు మార్చుకుని, తన సెక్సీ డ్యాన్స్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. “వండి చక్రం” చిత్రాన్ని తెలుగులో “ఘరానా గంగులు” పేరుతో రీమేక్ చేశారు. శోభన్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో స్మిత తమిళంలో చేసిన పాత్రనే పోషించింది. ఆమె నటనకు, నిషా కళ్లకు, డ్యాన్స్‌లకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక అప్పటినుంచి ఏ చిత్రంలోనైనా స్మిత డ్యాన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనే డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు ఆమెను తిరస్కరించిన నిర్మాతలు, కేవలం ఒక డ్యాన్స్ సీన్ కోసం 50,000 రూపాయలు డిమాండ్ చేసినా, ఆమె కాల్‌షీట్ల కోసం క్యూ కట్టేవారు. 1981 నుంచి 1996 వరకు స్మిత కెరీర్ ఉజ్వలంగా సాగింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించింది. నృత్య తారగానే కాకుండా కొన్ని చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను కూడా పోషించింది. అంతేకాదు, “వీర విహారం”, “ప్రేమించి చూడు” వంటి చిత్రాలను సొంతంగా నిర్మించి నిర్మాతగానూ ప్రయత్నించింది.
స్మిత జీవితంలోకి ఎంటరయిన డాక్టర్ రాధాకృష్ణ
కెరీర్ పరంగా శిఖరాలను అధిరోహించిన స్మిత జీవితంలోకి డాక్టర్ రాధాకృష్ణ ప్రవేశించాడు. ఆమెకు అండగా ఉంటానని చెప్పి, ఆమెను తన వశం చేసుకున్నాడు. రాధాకృష్ణ మాయమాటలకు ఆమె కరిగిపోయి, అతనికి పూర్తిగా లోబడిపోయింది. తన ఆర్థిక వ్యవహారాలన్నీ అతడికే అప్పగించింది. అప్పటికే పెళ్ళై, పిల్లలు ఉన్న రాధాకృష్ణను గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కూడా స్మిత సిద్ధపడింది. జెమిని గణేశన్ చేతిలో మహానటి సావిత్రి ఎలా మోసపోయిందో, రాధాకృష్ణ చేతిలో స్మిత అలా మోసపోయింది. తన చేతుల్లోకి స్మిత పూర్తిగా వచ్చిన తర్వాత రాధాకృష్ణ ఆమెపై ఆంక్షలు విధించడం ప్రారంభించాడు. ఆమె తల్లిని, తమ్ముడిని ఆమె దగ్గరకు రాకుండా చేశాడు. ఈ పరిణామాలన్నీ స్మితను మానసికంగా కుంగదీశాయి. మోసపోయానని గ్రహించిన స్మిత, 1996 సెప్టెంబర్ 23న తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో “కొన్ని ఇబ్బందుల వల్ల” ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిందే తప్ప, రాధాకృష్ణ పేరును ప్రస్తావించలేదు. ఆమె మరణానంతరం ఆమె జీవిత కథ ఆధారంగా “డర్టీ పిక్చర్” అనే హిందీ చిత్రం నిర్మించబడింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
