యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. అందం, అభినయంతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది శ్రుతి హాసన్ (Shruti Haasan). మొదటి సినిమా అనగనగా ఓ ధీరుడు మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నిది.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రుతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ మూవీతో మళ్లీ ఫాంలోకి వచ్చింది శ్రుతి..
ప్రస్తుతం ఈ అమ్మడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తోన్న సలార్ సినిమాలో నటిస్తుంది. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. ” నేను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటాను.. తన సినిమాలతో మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. కథానాయికగా అతని సినిమాలో ఓ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ తో కలిసి పనిచేయడం చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే అతను ఓ అద్భుతం. సెట్ లో పనిచేస్తున్నట్లుగా అనిపించదు. చాలా సరదాగా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2023లో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇందులో జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు.