
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు నింపింది. రంగనాథ్ మరణంపై నటుడు శివాజీ రాజా గతంలో కీలక విషయాలు వెల్లడించారు. రంగనాథ్‌తో తనకున్న బలమైన అనుబంధాన్ని, ఆయన చివరి క్షణాలను, ఆ తర్వాత సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శివాజీ రాజా హీరోగా నటించిన మొగుడు పెళ్ళామ్స్ సినిమాకు రంగనాథ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం బలమైన అనుబంధంగా మారిందని శివాజీ రాజా తెలిపారు. రంగనాథ్ తనను ఎప్పుడూ “హీరో” అని పిలిచేవారని, తనతో రెండు సినిమాలు చేయాలనే కోరికను పలుమార్లు వ్యక్తం చేశారని శివాజీ రాజా గుర్తుచేసుకున్నారు. ఒకానొక సందర్భంలో, “నేను శివాజీ రాజాను హీరోగా పెట్టి సినిమా తీయాలి. రెండో సినిమా కూడా అతనితోనే తీయాలి” అని రంగనాథ్ బహిరంగంగా చెప్పినప్పుడు తాను ఆశ్చర్యపోయానని శివాజీ రాజా పేర్కొన్నారు.
రంగనాథ్ తన ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మరణంపై తీవ్ర ఆవేదన చెందారని శివాజీ రాజా వెల్లడించారు. “ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోబోయే ముందు నాకు ఫోన్ చేసి ఉంటే, నేను సూసైడ్ చేసుకోవడం తప్పు, చేసుకోవద్దు అని అతన్ని మార్చేవాడిని” అని రంగనాథ్ తనతో పర్సనల్‌గా, ఇంటర్వ్యూలలోనూ చెప్పారని శివాజీ రాజా పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, తాను నాలుగైదు రోజులు మనిషిని కాలేకపోయానని శివాజీ రాజా వాపోయారు. రంగనాథ్ తన భార్యను ఎంత అద్భుతంగా చూసుకున్నారో కూడా శివాజీ రాజా వివరించారు. నడుము కింద పనిచేయక వీల్ చైర్‌లో ఉన్న భార్యను రంగనాథ్ మహానుభావుడిలా చూసుకున్నారని, ఆయనతో జర్నీ చేయడం వల్ల ఈ విషయాలు తనకు తెలిశాయని చెప్పారు. రంగనాథ్ భార్య చనిపోయినప్పుడు తాను ఆయన దగ్గరికి వెళ్ళగా, అరగంట తర్వాత చిరంజీవి గారు కూడా వచ్చారని, చిరంజీవి గారికి రంగనాథ్ అంటే చాలా ఇష్టమని, సింగపూర్‌లో సినిమా చేసినప్పుడు వారిద్దరూ రూమ్మేట్స్‌గా ఉన్నారని రంగనాథ్ స్వయంగా తనకు చెప్పేవారని శివాజీ రాజా తెలిపారు.
రంగనాథ్ మరణానంతరం ఆయన మృతదేహాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) కార్యాలయానికి తీసుకురావడంపై ఓ “పెద్ద వ్యక్తి” అభ్యంతరం వ్యక్తం చేయడం శివాజీ రాజాను తీవ్రంగా కలవరపరిచింది. “ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావ్?” అని ఆ వ్యక్తి అడగగా, శివాజీ రాజా తీవ్రంగా స్పందించారు. “చెంప పగిలిపోద్ది నా కొడకా కొట్టానంటే, రేపు నువ్వు పోయినా కూడా ఇక్కడే పెడతారు గుర్తుపెట్టుకో” అని ఘాటుగా బదులిచ్చినట్లు శివాజీ రాజా వివరించారు. రంగనాథ్ నివాసం చాలా దూరం కాబట్టి, సినీ పరిశ్రమలోని వారందరూ వచ్చి చూడటం కష్టం కనుక, సులభంగా నివాళులు అర్పించేందుకే MAA కార్యాలయం వద్దకు మృతదేహాన్ని తీసుకొచ్చానని శివాజీ రాజా స్పష్టం చేశారు. భారతదేశంలో ఏ నటుడైనా తమకు ఒకటేనని, సగౌరవంగా పంపించడం తమ బాధ్యత అని తాను చెప్పానన్నారు. అలాంటిది తన తెలుగు ఆర్టిస్టుకు చేయకుండా ఉంటానా అని ప్రశ్నించారు. “ఆ చెత్త నా కొడుక్కి తెలియదండి ఆ మాట అనేముందు.. నాకన్నా గొప్ప నటుడు, నా కాలి గోటికి కూడా సరిపోడు వెధవ. మనుషులు కాదండి వీళ్ళు కొంతమంది అసలు. ఎదురుగుండానే డెడ్ బాడీని పట్టుకొని ఇక్కడికెందుకు తీసుకొచ్చావ్ అంటాడండి” అని శివాజీ రాజా తీవ్ర అసహనాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ రోజు తానొక ఎద్దులాగా ఆగానని, లేకుంటే ఆ వ్యక్తిని మెట్ల మీద నుంచి కొట్టుకొని కిందకి తీసుకొచ్చేవాడినని శివాజీ రాజా తెలిపారు, పరిశ్రమలో కొందరు వ్యక్తుల వ్యవహార శైలిపై తన నిరసనను తెలియజేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి