మూవీ రివ్యూ: డంకీ
నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ తదితరులు
సంగీతం: ప్రీతమ్
సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరణ్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్
నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి
ఎడిటర్, దర్శకుడు: రాజ్ కుమార్ హిరాణి
2023లో సుప్రీమ్ ఫామ్‌లో ఉన్నాడు షారుక్ ఖాన్. పఠాన్, జవాన్ లాంటి సినిమాల తర్వాత షారుక్ నటించిన సినిమా డంకీ. పైగా అపజయమే లేని రాజ్ కుమార్ హిరాణి దర్శకుడు కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. 2023లో హ్యాట్రిక్ విజయాన్ని షారుక్ ఖాతాలో వేసుకున్నాడా.. మరో 1000 కోట్లు లోడ్ అవుతున్నాయా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) ఓ జవాన్. తన ప్రాణాలను కాపాడిన మహేందర్ కోసం పంజాబ్‌లోని ఓ చిన్న గ్రామానికి వస్తాడు. అక్కడ మన్ను (తాప్సీ), బుగ్గు (విక్రమ్ కోచ్చర్), బల్లి (అనిల్ గ్రోవర్) ఎలాగైనా ఇంగ్లండ్ వెళ్లి బాగా సంపాదించాలని అనుకుంటారు. అయితే వాళ్లకు ఇంగ్లీష్ రాకపోవడంతో అదే ఊళ్లో కోచింగ్ ఇచ్చే గులాటీ (బోమన్ ఇరానీ) ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతారు. వాళ్లతో పాటు హార్డీ కూడా కోచింగ్ తీసుకుంటాడు. సుఖి (విక్కీ కౌశల్) కూడా అదే కోచింగ్ సెంటర్‌లో ఉంటాడు. తను ప్రేమించిన అమ్మాయి లండన్‌లో కష్టాలు పడుతుండటంతో.. ఆమెను తీసుకొచ్చేందుకు వీసా అప్లై చేస్తాడు సుఖీ. కానీ అది రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు ఇంగ్లీష్ రాని వీళ్లంతా ఎలా ఇంగ్లండ్ వెళ్లారు.. అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది అసలు కథ..
కథనం:
సెంచరీ కొడతాడనుకున్న బ్యాట్స్‌మెన్ 90ల్లో రనౌట్ అయితే ఎలా ఉంటుంది..? డంకీ చూసిన తర్వాత చాలా మంది ఆడియన్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రాజ్‌కుమార్ హిరాణి గత సినిమాల ప్రభావమో ఏమో కానీ.. డంకీ ఎందుకో నాకు అంతగా కిక్ ఇవ్వలేదు. అలాగని తీసిపారేసే సినిమా అయితే కచ్చితంగా కాదు. కాకపోతే హిరాణి గత సినిమాల మ్యాజిక్ ఇందులో మిస్ అయింది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా తన మార్క్ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు రాజ్‌కుమార్ హిరాణి. దానికి షారుక్ ఖాన్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా తోడవ్వడంతో డంకీ దూసుకుపోయింది. కీలకమైన సెకండాఫ్ మాత్రం స్లో నెరేషన్ ఇబ్బంది పెట్టింది. మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే.. ఏ సినిమా తీసుకున్నా.. అన్నింట్లోనూ గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్ ఉంటాయి. ఆయా సినిమాల్లోనూ సింపుల్ కథలే ఉంటాయి కానీ ట్రీట్‌మెంట్ మాత్రం చాలా బలంగా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే గుర్తుకు వచ్చినప్పుడల్లా కళ్లతడి వచ్చేస్తుంది. అలాంటి సీన్స్ డంకీలో మిస్ అయినట్లు అనిపించింది. ఫస్టాఫ్‌లో విక్కీ కౌశల్ సీన్.. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌లో మినహాయిస్తే.. ఆ మ్యాజిక్ వర్కవుట్ అయినట్లు అనిపించలేదు. బ్రిటీష్ వాళ్లు మన దేశంలోకి చొరబడి 200 ఏళ్లు పాలించినా.. వాళ్లకు విసాలు అడగలేదు.. మన భాష వచ్చా అని అడగలేదు.. మరి మనం ఎందుకు అక్కడికి వెళ్లడానికి ఇన్ని కష్టాలు పడాలనే.. సోషల్ ఇష్యూనే తన సినిమాలో చూపించాడు హిరాణీ. బతుకుదెరువు కోసం పక్క దేశాలకు దొంగతనంగా వెళ్లిన వాళ్లు.. అక్కడ పడుతున్న కష్టాల్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు హిరాణి. తన ప్రతీ కథను కామెడీగానే చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు హిరాణీ. ఇందులోనూ అదే ట్రై చేసాడు కానీ కొన్నిచోట్ల మాత్రమే అది వర్కవుట్ అయింది. చాలా చోట్ల మిస్ ఫైర్ అయింది.
నటీనటులు:
షారుక్ ఖాన్ నటన గురించి ఏం చెప్పాలి.. ఆయన సుప్రీమ్ అంతే. ఆయన కనిపించిన ప్రతీ సీన్ అద్భుతంగా ఉంది. తన కారెక్టర్‌కు పూర్తి న్యాయం చేసాడు కింగ్ ఖాన్. తాప్సీ నటన బాగుంది.. కెరీర్‌లో మరో డిఫెరెంట్ కారెక్టర్ చేసింది ఈ బ్యూటీ. విక్కీ కౌశల్ ఉన్నది కాసేపే అయినా ఆకట్టుకున్నాడు. కథలో చాలా కీలకమైన పాత్ర ఇది. అలాగే ఫ్రెండ్స్ బ్యాచ్‌లో ఉన్న విక్రమ్ కోచ్చర్, అనిల్ గ్రోవర్ కూడా బాగున్నారు. ఎప్పట్లాగే బోమన్ ఇరానీ మరోసారి ఆకట్టుకున్నాడు.
టెక్నికల్ టీం:
మ్యూజికల్‌గా టాప్ నాచ్‌లో ఉంది డంకీ. ప్రీతమ్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. అమన్ పంత్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. కథా పరంగా చాలా దేశాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. అందుకే ముగ్గురు నలుగురు సినిమాటోగ్రఫర్స్ ఈ సినిమాకు పని చేసారు. సీకే మురళీధరణ్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌గానే కాకుండా దర్శకుడిగానూ కెరీర్‌లో మొదటిసారి రాజ్‌కుమార్ హిరాణీ తడబడినట్లు అనిపించింది. మామూలుగా చూస్తే డంకీ ఓకే.. కానీ రాజ్‌కుమార్ హిరాణీ బ్రాండ్ పరంగా చూస్తే నాట్ ఓకే అనిపిస్తుంది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా డంకీ.. పడుతూ లేస్తూ సాగిన ఇంగ్లండ్ ప్రయాణం..