Saif Ali Khan Case: బాలీవుడ్ యాక్టర్‌ సైఫ్‌పై దాడి కేసులో బిగ్‌ ట్విస్ట్‌

బాలీవుడ్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నిందితుడ్ని అరెస్ట్‌ చేశామన్న పోలీసులు, సాయంత్రానికి తూచ్‌ అంటూ నాలుక మడతేశారు. ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్‌, క్రమంగా కోలుకుంటున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Saif Ali Khan Case: బాలీవుడ్ యాక్టర్‌ సైఫ్‌పై దాడి కేసులో బిగ్‌ ట్విస్ట్‌
Saif Ali Khan Case

Updated on: Jan 17, 2025 | 8:20 PM

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. శుక్రవారం ఉదయం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో విచారణ తర్వాత…ఆ వ్యక్తిని వదిలేశారు. ఈ దాడితో అతగాడికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.  విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ అలీఖాన్ దాడి కేసుతో సంబంధం లేదని ముంబై పోలీసులు కన్ఫామ్ చేశారు.

ఇక అసలు నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్‌ టీమ్స్‌ గాలిస్తున్నాయి. ఇక సైఫ్‌ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం, దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో ఆగంతకుడిపై సెక్షన్‌ 331(4), సెక్షన్‌ 311 కింద కేసు నమోదు చేశారు. దొంగతనం కోసమే దుండగుడు సైఫ్‌ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ముంబైలో సంపన్నులు ఉండే బాంద్రా వెస్ట్‌ ప్రాంతంలో, సద్గురు శరణ్‌ బిల్డింగ్‌ 12వ అంతస్తులో బాలీవుడ్‌ హీరో సైఫ్‌ ఫ్లాట్‌ ఉంది. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్‌ ఇంట్లో చోరీ యత్నం, ఆయనపై దాడి ఘటన చోటు చేసుకుంది. మొదట సైఫ్‌ చిన్న కుమారుడు జహంగీర్‌ రూమ్‌లోకి చొరబడ్డ ఆగంతకుడ్ని చూసి హౌస్‌కీపర్‌ బిగ్గరగా అరవడంతో ఆమెపై దాడి జరిగింది. పనిమనిషి అరుపులు విని, ఆ గదిలోకి సైఫ్‌ వెళ్లగానే ఆయనపై కూడా దాడికి తెగబడ్డాడు దుండగుడు. సైఫ్‌పై కత్తితో దాడి చేసిన ఆగంతకుడు మెట్ల మార్గం గుండా పారిపోయాడు

దాడిలో గాయపడ్డ సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. దుండగుడి దాడిలో సైఫ్‌ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఎడమ చేతి మీద 2 గాయాలు, మెడ కుడి భాగం మీద మరో గాయం అవడంతో, వాటికి ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు డాక్టర్లు. ఇక సైఫ్‌ వెన్నెముకలో కత్తి ముక్క ఇరుక్కుపోవడంతో, స్పైనల్‌ ఫ్లూయిడ్‌ లీక్‌ అయింది. ఆపరేషన్‌ చేసి 2.5 అంగుళాల కత్తిముక్కను బయటకు తీశారు డాక్టర్లు. సైఫ్‌ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో, ఆయనను ICU నుంచి రూమ్‌కి షిఫ్ట్‌ చేశారు.

“సైఫ్‌కి చేతి మీద, మెడ మీద అయిన గాయాలకు డాక్టర్‌ లీనా జైన్‌ ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. వెన్నెముకలో ఉన్న కత్తిముక్కను తొలగించి, స్పైనల్‌ ఫ్లూయిడ్‌ లీక్‌ని అరికట్టాం” అని డాక్టర్‌ నితిన్ నారాయణ్ తెలిపారు.

సైఫ్‌కి నార్మల్‌ డైట్‌ అందిస్తున్నామని లీలావతి హాస్పిటల్‌ డాక్టర్లు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని, రెండుమూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు వైద్యులు.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి