Kantara 2: రిషబ్ శెట్టి కాంతార 2ను వెంటాడుతోన్న విషాదాలు.. మరో ఆర్టిస్ట్ హఠాన్మరణం.. ఈసారి ఏమైందంటే?

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం 'కాంతారా: చాప్టర్ 1'. గతంలో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఆర్టిస్టులు చనిపోగా, తాజాగా మరొకరు హఠాన్మరణం పాలయ్యారు.

Kantara 2: రిషబ్ శెట్టి కాంతార 2ను వెంటాడుతోన్న విషాదాలు.. మరో ఆర్టిస్ట్ హఠాన్మరణం.. ఈసారి ఏమైందంటే?
Kantara 2 Movie

Updated on: Jun 12, 2025 | 6:45 PM

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో నటిస్తోన్న ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా చనిపోతుండటం కన్నడ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కొన్ని రోజుల క్రితం కేరళ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నదిలో పడి చనిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇదే సినిమాలో నటిస్తోన్న రాకేష్ పూజారి గుండెపోటుతో కన్ను మూశాడు. ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తోన్న మరో జూనియర్ ఆర్టిస్ట్ తుది శ్వాస విడిచారు. కేరళలోని త్రిసూర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ విజు వికె బుధవారం (జూన్ 11) అర్ధరాత్రి గుండె నొప్పితో కుప్పకూలాడు. ఇలా కొన్ని నెలల వ్యవధిలో కాంతార 2 సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూయడం శాండల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. త్రిసూర్ లో నివాసముండే విజు వికే ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. అగుంబే సమీపంలోని హోమ్ స్టేలో ఆయన బస చేశారు. అయితే బుధవారం రాత్రి ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను తీర్థహళ్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని విజు కుటుంబ సభ్యులకు చేరవేయగా వారు వెంటనే కర్ణాటకకు బయలు దేరారు.

మూడో మరణం..

గతంలో, ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ అయిన కపిల్ మరణించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత, కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. నీటి లోతు తెలియకుండానే నదిలోకి దిగాడు. ఆ సమయంలో అతనికి గుండెపోటు వచ్చిందని, అందుకే ప్రాణాలు కోల్పోయాడని సన్నిహితులు తెలిపారు. ఈ సంఘటన మే 6న జరిగింది. దీని తర్వాత సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న రాకేష్ పూజారి కూడా మరణించాడు. ఆయన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో హీరో ఫ్రెండ్ రోల్ లో నటించినట్లు తెలుస్తోంది. తన స్నేహితుడి వివాహానికి హాజరైన ఆయన నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు.

‘కాంతార: చాప్టర్ 1’ అనేది ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్. 2022లో విడుదలైన కాంతార పాన్-ఇండియా స్థాయిలో హిట్ అయింది.ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ ను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ సంస్థనే ఈ ప్రీక్వెల్ ను కూడా రూపొందిస్తోంది. అయితే ఈ ఆర్టిస్టు మరణాలపై కాంతార టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .