
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు ఉండే ఫాలోయింగ్ సైతం తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే తాను అడిగిన ప్రశ్నకు డార్లింగ్ ఇచ్చిన ఆన్సర్ విని షాకయ్యానని అన్నారు. అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి, రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం భారతీయ సినీ చరిత్రను తిరగరాసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన ఐదేళ్ల కాలాన్ని కేటాయించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ప్రభాస్ చూపించిన అంకితభావం, దర్శకుడిపై ఆయనకున్న నమ్మకం గురించి రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఒకానొక సందర్భంలో ఆర్‌జీవీ స్వయంగా ప్రభాస్‌ను ఒక ప్రశ్న అడిగారట. ఒకే సినిమా కోసం ఆరు నెలల పాటు పూర్తి సమయాన్ని కేటాయించడం పట్ల ఎప్పుడైనా విచారం లేదా బాధ కలిగిందా అని ఆర్‌జీవీ ప్రశ్నించగా.. ప్రభాస్ ఇచ్చిన సమాధానం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని వర్మ వెల్లడించారు. “”సర్, ద వే ఫిల్మ్ ఈజ్ షేపింగ్ అప్, ఈ సినిమా షేప్ అవుతున్న విధానం చూస్తుంటే.. మూడు సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఇప్పుడే ఆరు సంవత్సరాలు అడిగినా నేను రాజమౌళి గారికి ఇచ్చేస్తాను” అని ప్రభాస్ ఎంతో నమ్మకంతో బదులిచ్చారట.
ప్రభాస్ నోట వచ్చిన ఈ మాటలు ఆయనకు సినిమా పట్ల ఉన్న అపారమైన కమిట్‌మెంట్‌ను, ప్రాజెక్ట్ విజయంపై ఆయనకున్న దృఢమైన నమ్మకాన్ని తెలియజేస్తాయని ఆర్‌జీవీ ప్రశంసించారు. ఒక స్టార్ హీరో తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సామాన్యమైన విషయం కాదని, అది కేవలం ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైందని ఆయన అన్నారు. దర్శకుడు రాజమౌళి తన నిజాయితీ, పని పట్ల ఉన్న నిబద్ధత ద్వారానే ప్రభాస్‌లో అలాంటి అచంచలమైన విశ్వాసాన్ని కలిగించగలిగారని ఆర్‌జీవీ వివరించారు. కథపై దర్శకుడికి ఉన్న స్పష్టత, నటీనటులను నడిపించే తీరు చూశాకే ప్రభాస్ తన సర్వస్వాన్ని ఆ సినిమా కోసం ధారపోశారని, అందుకే ‘బాహుబలి’ అంతటి ప్రపంచ స్థాయి విజయాన్ని సాధించిందని అన్నారు. నిజానికి బాహుబలి సినిమాతో ప్రభాస్ స్థాయి ప్రపంచవ్యాప్తంగా మారిపోయింది.