
సాధారణంగా సెలబ్రిటీలు డైట్ అంటే ఏదో రకమైన కఠినమైన నియమాలు పాటిస్తారని మనం అనుకుంటాం. కానీ ఈ మాస్ మహారాజా మాత్రం చాలా సింపుల్, కానీ ఒక సైంటిఫిక్ పద్ధతిని పాటిస్తున్నారు. ఆయన డైట్ ప్లాన్ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనే టైమింగ్స్ ఆయనకు అస్సలు ఉండవు. తన బాడీకి ఎప్పుడు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. అసలు రవితేజ పాటిస్తున్న ఆ వింత డైట్ ఏంటి? ఆయన అంత యంగ్‌గా కనిపించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?
రవితేజ అనుసరించే అతి ముఖ్యమైన నియమం ఒక్కటే.. “బాడీకి నిజంగా ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవడం”. చాలామంది ఉదయం 8 అయింది కదా అని టిఫిన్, మధ్యాహ్నం 1 అయింది కదా అని భోజనం చేస్తుంటారు. కానీ రవితేజ మాత్రం గడియారాన్ని అస్సలు పట్టించుకోరు. తన మెదడు ఇచ్చే హంగర్ సిగ్నల్స్ ఆధారంగానే ఆయన భోజనం చేస్తారు. దీనివల్ల జీర్ణవ్యవస్థపై అనవసరమైన భారం పడదు. రవితేజ రోజుకు కేవలం మూడు సార్లు మాత్రమే ఘనాహారం తీసుకుంటారు.
Fitness Of Rt
ప్రతి భోజనానికి మధ్య కనీసం రెండున్నర నుంచి మూడు గంటల సమయం ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల మన శరీరం తీసుకున్న పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తుంది. “మనం ఏం తింటున్నాం అనే దానికంటే, మన శరీరం దేనిని అరిగించుకుంటోంది అనేదే ముఖ్యం” అనేది ఆయన ఫిలాసఫీ. ఈ పద్ధతి వల్ల కడుపు ఉబ్బరం తగ్గడమే కాకుండా, మెటబాలిజం చురుగ్గా మారుతుంది.
ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, శారీరక శ్రమ కూడా అంతే ముఖ్యం అని రవితేజ నమ్ముతారు. ఒకవేళ మీరు బాగా తిని రోజంతా కూర్చుని ఉంటే, అది నేరుగా కొవ్వుగా మారి కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది. అందుకే ఆయన స్ట్రెంత్ ట్రైనింగ్ లేదా రెసిస్టెన్స్ వర్కవుట్స్ తప్పనిసరిగా చేస్తారు. కండరాలు దృఢంగా ఉంటేనే శరీరం హార్మోన్ల పరంగా, మెటబాలిక్ పరంగా యంగ్‌గా పని చేస్తుందని ఆయన నిరూపించారు.
రవితేజ ఒక ఆసక్తికరమైన సూత్రాన్ని నమ్ముతారు.. “మజిల్స్ ఆర్ యూత్” (కండరాలే యవ్వనం). మన శరీరంలో లీన్ మజిల్ ఎంత ఎక్కువగా ఉంటే, మన అవయవాలు అంత మెరుగ్గా పనిచేస్తాయి. దీనివల్ల చూడటానికి మాత్రమే కాదు, అంతర్గతంగా కూడా బాడీ చాలా బలంగా మారుతుంది. ట్రెండ్స్ వెంట పడకుండా తన శరీరానికి ఏది అవసరమో దానినే ఆయన అనుసరిస్తున్నారు. కఠినమైన డైట్ కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని రవితేజ మరోసారి నిరూపించారు. కష్టపడి వర్కవుట్ చేయడం, తెలివిగా తినడం, శరీరం ఇచ్చే సిగ్నల్స్ వినడం.. ఇవే రవితేజ ఫిట్‌నెస్ సీక్రెట్స్.