
మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందుతోన్న మొదటి పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. ప్రస్తుతం అరకులోయలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అరకు సమీపం లోని అనంతగిరిలో రవితేజ శనివారం సందడి చేశారు. అనంతగిరి లో వ్యూ పాయింట్ లో నిర్మించిన హరిత రిసార్డ్సు ప్రాంగణం తో పాటు స్థానిక హోటళ్ల వద్ద టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి సంబందించిన షూటింగ్ లో రవితేజ పాల్గొన్నారు. షూటింగ్ హడావుడి తో ఈ అభిమానులు, స్థానిక గ్రామాల గిరిజన సోదరులు, టూరిస్ట్ లు కూడా పెద్దఎత్తున ఆ ప్రదేశానికి తరలివచ్చారు. అయితే చిత్రానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయతించినా చిత్ర యూనిట్ అంగీకరించలేదు. చివరకు స్థానిక అధికారుల తో కలిసి దిగిన ఫోటో మాత్రమే విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఉండే స్టువర్టుపురం అనే గ్రామానికి చెందిన గోకరి నాగేశ్వరరావు అనే ఓ దొంగ ఇతివృత్తంగా సాగుతున్న ఈ సినిమా లో కొన్ని కీలక సన్నివేశాలను అనంతగిరి లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఆ నాగేశ్వర రావుకే టైగర్ అని కూడా పేరు , వారసత్వంగా వచ్చిన దొంగతనం వృత్తిని మరింత ధైర్య సాహసాలతో చేయడమే కాకుండా సమీప గ్రామాల ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకునే పాత్ర కు సంబందించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. టైగర్ నాగేశ్వర్ రావు కోసం పోలీసులు రావడం, ఆ విషయం తెలిసి గ్రామం అంతా పోలీసులపై కి తిరగబడడం లాంటి సీన్ లతో పాటు కొన్ని డ్యూయెట్ లను కూడా అరకు కొండల్లో చిత్రీకరిస్తున్నారట. దీంతో సుదీర్ఘ షెడ్యూల్ నే అరకు లోయ లో పెట్టుకున్నారు కానీ పూర్తి వివరాలు మాత్రం యూనిట్ వెల్లడించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో అరకు వ్యాలీ ఒకరకంగా చెప్పాలంటే ఊటీ లాంటిదే. ఆంధ్రా ఊటీ అని కూడా పేరు. చారిత్రక ప్రదేశాలకు, ప్రకృతి అందాలకు అరకు కేరాఫ్ ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి ప్రారంభం అయి అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య అరకు అందాలు పర్యాటకులను అట్టే ఆకట్టుకుంటాయి. తెల్లవారుజామున మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపించే పర్వతాలు, మబ్బులతో నిండుకునే లోయలు, చల్లని వాతావరణంతో పాటు అక్కడి ప్రజలు కూడా ఆప్యాయంగా, అమాయకంగా మనల్ని అట్టే ఆకట్టుకుంటారు. అందుకే అబ్బురపరిచే ఈ పర్యాటక ప్రదేశాలు సినిమా షూటింగ్ లకు కూడా ప్రసిద్ధి. ఇక్కడి సహజసిద్ధ ప్రకృతి అందాలు సినిమా లొకేషన్లకు అతికినట్టు అడ్డిపోతాయి. దీంతో నిత్యం ఇక్కడ సినిమా షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ‘కశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ తర్వాత ఆయన నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. అభిషేక్ అగర్వల్ ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్.
టైగర్ నాగేశ్వరరావు టీజర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.