శ్రీశ్రీ మరదలు, రాజబాబు వదిన రమోలా ఇప్పుడెక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..?

రమోలా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఘంటసాలతో కలిసి గాయనిగా, వైజయంతిమాల బృందంలో నర్తకిగా, డబ్బింగ్ కళాకారిణిగా అగ్రశ్రేణి నటి మనోరమకు గాత్రం పోశారు. మహాకవి శ్రీశ్రీ, హాస్యనటుడు రాజబాబులకు మరదలు అయిన రమోలా జీవితం అనేక మలుపులతో కూడి, ప్రభువు సేవలో ముగిసింది.

శ్రీశ్రీ మరదలు, రాజబాబు వదిన రమోలా ఇప్పుడెక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..?
Ramola

Updated on: May 07, 2026 | 6:38 PM

తెలుగు సినీ చరిత్రలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన రమోలా, తన ప్రతిభతో నటిగా, గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. విజయనగరంలో ఉపద్రష్ట సూర్యనారాయణ, సీతారామా దంపతులకు 1946 సెప్టెంబర్‌ 24న తొమ్మిదో సంతానంగా ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు రామం, ఇది ఆమె నానమ్మ పేరు. రమోలాకు కళా ప్రపంచంతో బలమైన బంధుత్వాలున్నాయి. ఆమె అక్క సరోజ మహాకవి శ్రీశ్రీ భార్య కాగా, ఆమె చెల్లెలు లక్ష్మీ అమ్ములు హాస్యనటుడు రాజబాబు భార్య. విజయనగరంలో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న రామం, ఆ తర్వాత మద్రాసు వెళ్లిపోయారు. ఆమె అక్క సరోజ మద్రాసు సెంట్రల్‌ కాలేజీలో చేరడంతో, తోడుగా ఉండేందుకు రామం కూడా మద్రాసులో స్థిరపడ్డారు. బాల్యం నుంచే రామంకు సినిమా పాటలంటే ఎంతో పిచ్చి. అక్క హరికథలు చెబుతున్నప్పుడు, మధ్యలో విరామం వచ్చినప్పుడల్లా మల్లీశ్వరి చిత్రంలోని పాటలను ఆలపించేవారు. మద్రాసు వచ్చిన తర్వాత అక్కయ్య ప్రోత్సాహంతో బాలానందం వంటి పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మద్రాసు రేడియో కేంద్రం నిర్వహించిన పాటల పోటీల్లో నటి జయసుధ తల్లి జోగాబాయితో పోటీపడి, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా పాటను ఉద్వేగంగా పాడి పెండ్యాల, ఘంటసాల వంటి దిగ్గజాల ప్రశంసలు అందుకున్నారు.

రమోలా తెరపై కనిపించిన తొలి చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన “అన్నదాత”, ఇందులో ఆమె అంజలీదేవి పిల్లల్లో ఒకరిగా నటించారు. అంజలి పిక్చర్స్‌ నిర్మించిన “సువర్ణసుందరి” చిత్రంలో జిక్కీ పాడిన జగదీశ్వరా పాహి పరమేశ్వరా పాటకు కోరస్‌ అందించడం ద్వారా ఆమె గాయనిగా ప్రస్థానం మొదలైంది. ఆమె అసలు పేరు రామంను “రమోలా”గా మార్చింది నాటి ప్రముఖ నటి వైజయంతిమాల. వైజయంతిమాల తన నృత్య బృందంలో రమోలాను సభ్యురాలిగా చేర్చుకుని, నృత్య నాటికల్లో అవకాశాలు కల్పించారు. 1964 నుంచి రమోలా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. కొన్ని నాటకాల్లో ఆమె కృష్ణుడిగా, వైజయంతిమాల రాధగా నటించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన “చండాలిక” నృత్యనాటికలో రమోలా, ఆమె చెల్లెలు లక్ష్మీ అమ్ములు కూడా పాల్గొన్నారు. గాయనిగా రమోలాను ఘంటసాల ఎంతగానో ప్రోత్సహించారు. “దత్తపుత్రుడు” చిత్రంలో ఘంటసాలతో కలిసి పాడిన “మనసైనా ఓ చిన్నదానా” ఆమెకు మంచి పేరు తెచ్చింది. 1965లో జీకే వెంకటేష్ సంగీత దర్శకత్వంలో పీబీ శ్రీనివాస్‌తో కలిసి “జానారే జానా” చిత్రంలో ఓ యుగళగీతం పాడటం ద్వారా గాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన మరిది రాజబాబుతో “జీవితనౌక” చిత్రంలో ఒక పాట పాడటమే కాకుండా, హిందీలో లతామంగేష్కర్‌, ఆశాభోంస్లేలతో కూడా పాటలు పాడారు.

నటిగా స్థిరపడటానికి రమోలా ఎంతో కృషి చేశారు. “కృష్ణవేణి”, “జీవనజ్యోతి”, “జీవితనౌక”, “మరపురాని మనిషి”, “పొరుగింటి పుల్లకూర”, “నాయుడుబావ”, “నామాల తాతయ్య” వంటి దాదాపు 75 చిత్రాల్లో నటించినప్పటికీ, ప్రధాన నటిగా ఆమెకు గుర్తింపు లభించలేదు. పలు చిత్రాల్లో పాత్రధారణతో పాటు గాత్రధారణ కూడా చేశారు. నాగభూషణం ప్రదర్శించిన “రక్తకన్నీరు” నాటకంలో, జమున “శ్రీకృష్ణతులాభారం” నాటకంలో నళిని పాత్రలో రమోలా పాల్గొన్నారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా రమోలాకు మంచి గుర్తింపు లభించింది. ఆమె తొలి డబ్బింగ్ చిత్రం “జగదేకవీరుని కథ”, ఇందులో ఎల్‌ విజయలక్ష్మికి డబ్బింగ్ చెప్పారు. ఎంజీఆర్‌ నటించిన “లోకం చుట్టిన వీరుడు” చిత్రం తర్వాత డబ్బింగ్ రంగంలో ఆమె బిజీ అయ్యారు. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల నుండి తెలుగులోకి డబ్ అయిన వందలాది చిత్రాలకు ఆమె గాత్రం అందించారు. ముఖ్యంగా నటి మనోరమకు ఆమె డబ్బింగ్ చెప్పిన తీరు ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. మనోరమ నటించాలి, రమోలా డబ్బింగ్ చెప్పాలి అనేంతగా పాపులర్ అయ్యారు. రమోలా వైవాహిక జీవితం విషాదాంతం కాగా, తల్లి మరణంతో ఆమె జీవితం చీకటిమయమైంది. ఈ సమయంలోనే ఆమె మతం మార్చుకుని క్రైస్తవ మతం స్వీకరించారు. ఏసు గురించి 35 పాటలు కూడా రాశారు. ప్రస్తుతం ఆమె తన జీవిత చరమాంకాన్ని ప్రభువు సేవలో గడుపుతూ చెన్నైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.ః

 

Follow Us