సొంత కథతో బాక్సాఫీస్ వద్ద యుద్ధం! వరుస ప్లాపులతో కొత్త దారి ఎంచుకున్న టాలీవుడ్ హీరో!

టాలీవుడ్ లో ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆ హీరో.. ఒకప్పుడు ‘ఇస్మార్ట్’ మ్యాజిక్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు వరుసగా నిరాశ పరుస్తుండటంతో, ఇప్పుడు ఆయన తన కెరీర్ విషయంలో ఒక అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

సొంత కథతో బాక్సాఫీస్ వద్ద యుద్ధం! వరుస ప్లాపులతో కొత్త దారి ఎంచుకున్న టాలీవుడ్ హీరో!
Ram Pothineni

Updated on: Feb 09, 2026 | 5:45 PM

ఆయన డ్యాన్స్ చేస్తే థియేటర్లో స్టెప్పులు పడాల్సిందే.. ఆయన డైలాగ్ చెబితే మాస్ ఆడియన్స్ కు పూనకాలు రావాల్సిందే. టాలీవుడ్ లో ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆ హీరో.. ఒకప్పుడు ‘ఇస్మార్ట్’ మ్యాజిక్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు వరుసగా నిరాశ పరుస్తుండటంతో, ఇప్పుడు ఆయన తన కెరీర్ విషయంలో ఒక అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఇతరులు చెప్పిన కథలపై ఆధారపడకుండా, తనలోని అసలు సిసలు టాలెంట్ ను బయటకు తీయబోతున్నారు. పదిహేనేళ్ల సినీ ప్రయాణంలో ఎప్పుడూ చేయని ఒక కొత్త ప్రయోగానికి ఆయన శ్రీకారం చుట్టారు. దీనికోసం ఏకంగా మూడు నెలల పాటు దేశం విడిచి ఏకాంతంగా గడపబోతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎంచుకున్న కొత్త దారి ఏంటి?

టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని కెరీర్ ప్రస్తుతం ఒక క్లిష్ట దశలో కొనసాగుతోంది. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఆయనకు, ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత సరైన బ్లాక్‌బస్టర్ దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన ‘రెడ్’, ‘ది వారియర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. తాజాగా విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మీద రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి పూర్తిగా నెగటివ్ టాక్ రాకపోయినప్పటికీ, కమర్షియల్ గా మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం రామ్ కెరీర్ పై ప్రభావం చూపింది. దీంతో ఆయన తన పనితీరును మరోసారి విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నటుడే కాదు రచయిత కూడా..

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే రామ్ కేవలం మంచి నటుడే కాదు, ఆయనలో ఒక మంచి రచయిత కూడా దాగి ఉన్నారు. దానికి నిదర్శనమే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంలో ఉన్న ‘నువ్వుంటే చాల్లే’ అనే పాట. ఈ మెలోడీ సాంగ్ ను స్వయంగా రామే రాశారు. ఈ పాట విన్న సినీ వర్గాలు ఆయనలోని సాహిత్య పరిజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ చిన్న అనుభవమే ఇప్పుడు ఆయనను ఒక పెద్ద అడుగు వేసేలా ప్రేరేపించింది. తన తదుపరి సినిమా కథను తానే స్వయంగా సిద్ధం చేయాలని రామ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తన కొత్త సినిమా కథపై పూర్తి దృష్టి పెట్టేందుకు రామ్ ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దీనికోసం ఆయన విదేశీ విహారయాత్రకు వెళ్లి, అక్కడ సుమారు మూడు నెలల పాటు ఏకాంతంగా గడపనున్నారట. ఎటువంటి ఫోన్ కాల్స్, ఇంటర్వ్యూలు లేకుండా కేవలం స్క్రిప్ట్ వర్క్ మీదనే ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. కథ, కథనం, డైలాగులు అన్నీ పక్కాగా సిద్ధం చేసుకున్న తర్వాతే మళ్ళీ హైదరాబాద్ అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఒక ఫ్రెష్ స్టోరీని రామ్ సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.

కొత్త దర్శకుడితో ప్రయోగం..

స్వయంగా కథ రాసుకుంటున్న రామ్.. ఈ ప్రాజెక్ట్ ను ఒక కొత్త దర్శకుడికి అప్పగించే ఆలోచనలో ఉన్నారట. తన విజన్ ను సరిగ్గా అర్థం చేసుకునే యువ దర్శకుడు అయితేనే న్యాయం జరుగుతుందని ఆయన నమ్ముతున్నారు. అన్నీ కుదిరితే జూన్ లేదా జూలైలో ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వరుస ఫ్లాపుల తర్వాత ఇలా స్వయంగా కథ రాసుకుని ప్రయోగానికి సిద్ధమవ్వడం రామ్ అభిమానుల్లో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఒక నటుడు తన కథను తానే రాసుకోవడం అనేది పెద్ద సాహసమే. కానీ రామ్ వంటి టాలెంటెడ్ హీరో ఆ బాధ్యత తీసుకుంటే ఫలితం మరోలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ ‘స్వయంకృషి’తో రామ్ మళ్ళీ విజయపథంలోకి వస్తారా? ఆయన రాస్తున్న ఆ కథ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.