Raghava Lawrence: నిజంగా నువ్వు దేవుడివి సామి.. అమ్మ పేరుతో మరో గొప్ప పనికి లారెన్స్ శ్రీకారం.. వీడియో

సొంతంగా వృద్ధ, అనాథాశ్రమాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి నీడను అందిస్తున్నాడు రాఘవ లారెన్స్. అనాథ, పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. రైతులకు ట్రాక్టర్లు అందజేస్తున్నాడు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నాడు. శరణు కోరి వచ్చిన వారికి ఎలాంటి సాయమైనా చేసే లారెన్స్ ఇప్పుడు మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు.

Raghava Lawrence: నిజంగా నువ్వు దేవుడివి సామి.. అమ్మ పేరుతో మరో గొప్ప పనికి లారెన్స్ శ్రీకారం.. వీడియో
Raghava Lawrence

Updated on: Sep 18, 2025 | 5:56 PM

కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నాడు. ఈ మధ్యన పెద్దగా సినిమాల్లో కనిపించని ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ సామాజిక సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే వృద్ధులు, అనాథలు, రైతులు, విద్యార్థులు, దివ్యాంగులు ఇలా ఎందరికో ఆపన్న హస్తం అందించాడు రాఘవ లారెన్స్. ఇప్పుడు పేద పిల్లల ఆకలి తీర్చేందుకు మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. తన తల్లి పేరు మీద ‘కణ్మణి అన్నదాన విందు’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ధనవంతులు తినే నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందించి వారి కళ్లల్లో ఆనందం నింపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని లారెన్స్ పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ పెట్టాడు.

‘కన్మణి అన్నదాన విరుందు (విందు) ఒక కొత్త ప్రారంభం. ఈ రోజు నా హృదయానికి దగ్గరగా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించా. ఈ కార్యక్రమానికి కన్మణి అన్నదాన విరుందు అని నా తల్లి పేరునే పెట్టాం. ధనవంతులు మాత్రమే ఆస్వాదించే ఆహారాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడని వారికి అందుబాటులో ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రుచికరమైన ఆహారం అనేది ఒక ప్రత్యేక హక్కుగా ఉండకూడదు. అది ప్రతి హృదయానికి చిరునవ్వులు తెచ్చే ఆనందంగా ఉండాలి. పిల్లలు, పెద్దలతో కలిసి నారి కురవర్గల్ సంఘంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నారులు వివిధ రకాల రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించినప్పుడు వారి కళ్లలో ఆనందాన్ని చూసి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో, అందరి ఆకలిని తీర్చే ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు లారెన్స్.

ఇవి కూడా చదవండి

పేదల ఆకలి తీర్చేందుకు..

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజనలు రాఘవ లారెన్స్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.