AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రూ. 10 వేలకు కథను అమ్మేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. పవన్‌తో హిట్ కొట్టాడు.. ఎవరంటే.?

దర్శకుడు పూరి జగన్నాధ్ తన మొదట రెండు చిత్రాలు ఆగిపోయినా నిరాశ పడకుండా, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని కలలు కన్నారు. బద్రి కథను మొదట పది వేలకు అమ్మాలని సిద్ధపడిన పూరి, ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఆరు నెలలు శ్రమించి.. తన తొలి విజయాన్ని అందుకున్నారు.

Tollywood: రూ. 10 వేలకు కథను అమ్మేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. పవన్‌తో హిట్ కొట్టాడు.. ఎవరంటే.?
Tollywood
Ravi Kiran
|

Updated on: Feb 10, 2026 | 9:37 AM

Share

దర్శకుడు పూరి జగన్నాధ్ తొలినాళ్ళలో ఊహించని అడ్డంకులను ఎదుర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో సుమన్ హీరోగా ప్రారంభమైన పాండు చిత్రం, అలాగే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అనుకున్న తిలానా చిత్రాలు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. అయినప్పటికీ, తన ప్రతిభపై పూర్తి విశ్వాసం ఉన్న పూరి.. రోజుకు పది కథలు రాసేవారు. దూరదర్శన్ కోసం ఎపిసోడ్లు, యాడ్ ఫిల్మ్స్, గులాబీ, రంగీలా, సింధూరం, నిన్నే పెళ్ళాడతా వంటి చిత్రాలకు టీవీ ట్రైలర్‌లు రూపొందించడం లాంటివి చేశారు. ఈ దశలో, పదేళ్ల క్రితం ఓ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రేమకథ ఆధారంగా రాసిన కథను పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించాలని పూరి జగన్నాధ్ కలలు కన్నారు. ఈ కథను మొదట నాగార్జున, అమలకు వినిపించినా ఫలితం లేకపోయింది. ఓ నవలా రచయిత ఈ కథను పది వేల రూపాయలకు కొని నవలగా రాయమని కోరగా, పూరి మొదట్లో అంగీకరించినా.. మధ్యలో ఆపేశారు. రాంగోపాల్ వర్మ క్యాంప్‌లో ఉన్నప్పుడు రమణ అనే దర్శకుడికి ఈ కథను ఇవ్వమని చెప్పినా ఆయనకు నచ్చలేదు. అయితే, ఈ కథ పవన్ కళ్యాణ్‌కు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం పూరిలో ఉంది.

పవన్ కళ్యాణ్‌ను కలవడం పూరికి సవాలుగా మారింది. ఆరు నెలల పాటు తొలిప్రేమ షూటింగ్ వద్దకు రోజూ వెళ్లి వచ్చారు. చివరకు, ఛోటా కె. నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ సాధించారు. పవన్ కోసం రాసిన కథ కాకుండా, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథను ఛోటాకు వినిపించి ఒప్పించారు. 1999 ఆగస్టు 24న తెల్లవారుజామున నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన పూరి, కేవలం అరగంటలో కథ చెప్పాలనే షరతును ఎదుర్కొన్నారు. తన కథపై నమ్మకంతో, అరగంట వినమని, నచ్చకపోతే వెళ్లిపోతానని చెప్పి పవన్‌ను ఒప్పించారు. పూరి కథ చెప్పడం మొదలుపెట్టగా, పవన్ కళ్యాణ్ అరగంట దాటి, ఉదయం ఎనిమిది గంటల వరకు విన్నారు.

కథ నచ్చిన పవన్, క్లైమాక్స్ మార్చమని కోరడంతో పూరి గందరగోళానికి గురయ్యారు. ఒక వారం పాటు ఏడు క్లైమాక్స్ లు రాసినా, చివరకు మొదటి క్లైమాక్స్ పైనే నమ్మకంతో పవన్ వద్దకు వెళ్లారు. “ఇదేంటి, ఇది పాత క్లైమాక్స్ కదా?” అని పవన్ అడగగా, పూరి తన నమ్మకాన్ని వివరించారు. పవన్ కళ్యాణ్ సంతోషించి, “నువ్వు క్లైమాక్స్ మార్చి ఉంటే మనం సినిమా చేసేవాళ్ళం కాదేమో. నీ కథపై నీకున్న నమ్మకాన్ని పరీక్షించడానికే క్లైమాక్స్ మార్చమన్నాను” అని ప్రశంసించారు. అయితే ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఒక షరతు విధించారు. “టాకీ పార్ట్‌లో నేను వేలు పెట్టను, కానీ పాటల చిత్రీకరణ బాధ్యత అంతా నాదే” అని అనగా, పూరి అంగీకరించారు. పూరికి యాభై వేల రూపాయల అడ్వాన్స్ లభించింది. కొన్ని నెలల విరామం తరువాత, హీరోయిన్ల ఎంపిక జరిగింది. తొలుత రేణు దేశాయ్, అమీషా పటేల్ ఎంపికైనా, సరయు పాత్రకు అమీషా సూచనతో పాత్రలను మార్చారు. హీరో పేరు నంద నుంచి బద్రి గా, విలన్ పేరు బద్రి నుంచి నందగా మారాయి. సినిమా టైటిల్‌గా బద్రిని ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ సూచనతో ప్రముఖ కెమెరామెన్ మధు అంబట్, అలాగే రమణ గోగుల సంగీత దర్శకుడిగా చేరారు. హైదరాబాద్‌లో టాకీ పార్ట్ షూటింగ్, న్యూజిలాండ్‌లో పాటల చిత్రీకరణ జరిగాయి. 2000 ఏప్రిల్ 20న విడుదలైన బద్రి చిత్రం.. పవన్ కళ్యాణ్‌కు వరుసగా ఆరో విజయాన్ని, పూరి జగన్నాధ్‌కు సరికొత్త అధ్యాయాన్ని అందించింది.