
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. లేటెస్ట్‌గా అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి వివరాలు వెల్లడించారు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాది ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 2024కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు మినహా.. ఉమ్మడి రాష్ట్రంలో ఎలా జరిగిందో అలాగే అవార్డుల ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. ఈసారి పైడి జయరాజ్, కాంతారావు పేరుతో గౌరవ పురస్కారాలు అందజేస్తామన్నారు దిల్ రాజు.
గతంలో సింహా అవార్డుల కోసం దరఖాస్తుదారులు ఎఫ్‌డీసీకి కొంత డబ్బు చెల్లించారని.. ఆ డబ్బంతా తిరిగి వాళ్లకు ఇచ్చేస్తామన్నారు దిల్ రాజు. గద్దర్ అవార్డ్స్ కోసం ఏర్పాటైన జ్యూరీ కమిటీ త్వరలోనే విజేతల్ని ఖరారు చేస్తుందన్నారు. పురస్కారాల కోసం ఓ నమూనా సిద్ధమవుతోందని.. ఏప్రిల్‌లో జరిగే వేడుక చాలా గ్రాండ్‌గా ఉండబోతుందన్నారు. సినిమా అవార్డుల విషయాన్ని ఎవరూ వివాదం చేయొద్దని.. తీ ఒక్కరూ పాజిటివ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.