Mohan Babu: నటుడు, మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు పై పోలీసులకు ఫిర్యాదు అందింది. తమ వృత్తిని మోహన్ బాబు అవమాన పరిచారని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం తర్వాత మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు, ఘర్షణలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. సినిమా ఎన్నికల్లో ఏమిటీ గొడవలు.. ఏమిటి బీభత్సం.. ఏంటి ఘర్షణలు.. ప్రజలందరూ చూస్తున్నారు.. గొర్రెలు, మేకలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది.. అతను కూడా ఇక్కడ జరిగిందంతా చూస్తున్నాడు. అతనికి కూడా తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందని.. అని అన్నారు.
దాంతో తమ వృత్తిని అవమానించేలా మోహన్ బాబు మాట్లాడారని, ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గొర్రెల కాపరులు చూస్తే సినిమా వాళ్ళ గౌరవం పోతుంది అనేలా మోహన్ బాబు మాట్లాడారని.. ఈవిధంగా తమను అవమానిస్తూ మాట్లాడటం సరికాదని.. మోహన్ బాబు పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని.. గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇటీవల జరిగిన మా ఎన్నికల రచ్చ గురించి అందరికి తెలిసిందే..
మరిన్ని ఇక్కడ చదవండి :