R.Narayana Murthy: సిద్ధాంతాలు చెప్పడానికి చలా బావుంటాయి. వినేవారికి కూడా అబ్బో అనిపిస్తాయి. ప్రాక్టికల్ గా వాటిని ఆచరించడానికి మాత్రం వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళలో అధిక శాతం చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఆదర్శాలు వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం వాటికి చాలా దూరం ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే.. తీసే సినిమాల్లో ఎన్నో ఆదర్శాలు.. అద్భుతాలు.. చితికిన జీవితాలు.. అభ్యుదయ భావాలు.. ఇలా ఎన్నైనా తెరమీద ఒలకపోసేసి.. ప్రజల నుంచి ఆహా ఓహో అనిపించుకుని కాసులు చేసుకుంటారు. తెరవెనుక మాత్రం ఒక్క ఆదర్శమూ ఆచరణలో కనిపించదు.
చాలా అరుదుగా మాత్రమె ఈ రంగుల ప్రపంచంలో నేనున్నాను అంటూ దండోరా వేసుకుంటూ ఒకడు వస్తాడు. స్వతంత్ర భారతంలో ఎర్రదండును తీసుకుని రైతు రాజ్యం కోసం ఛలో అసెంబ్లీ అంటూ పీపుల్స్ వార్ కి లాల్ సలామ్ చేసి.. దానినే జీవన మార్గంగా మార్చుకుని తెర ముందూ.. వెనుకా.. ఒకేలా ఉంటాడు. సినిమాలో పాత్ర పరంగా చిరిగిన బట్టలు కట్టి కష్టాలను ఎదురీదిన మనిషిగా కనిపించే నటుడు.. బయట ఆడీ కారులో తిరిగే హీరో లాంటి వాడు కాదు.. కెమెరా ముందు.. వెనుకా కూడా ఒకటే తీరు ఆయనది. తాను నమ్మిన ఎర్రబాటను.. సినిమాల్లో రెడ్ కార్పెట్ గా పరుచుకుని ఎదిగిపోవాలని అనుకోలేదు ఆయన. ప్రజల కష్టాన్ని.. రాజ్యాధికారం కోసం కామందులు చేసే అరాచక దురాగతాలను కళ్ళకు కట్టినట్టు చూపించి.. వ్యవస్థలో లోపాలను ఎలుగెత్తి చాటే సినిమాలు తీస్తున్న నిజమైన హీరో. హిట్..ఫట్ తో పనిలేదు. డబ్బు వచ్చినా అదే తీరు.. పోయినా అంతే హుషారు. ఇదంతా చెప్పిన తరువాత ఇక ఆయన పేరు చెప్పకపోయినా మీకు అర్ధం అయిపోయి ఉంటుంది. ఈరోజు పుట్టినరోజు (డిసెంబర్ 31-1953) జరుపుకుంటున్న ఆర్. నారాయణ మూర్తికి శుభాకాంక్షలు చెప్పడం కోసం ఈ కథనం అని. అవును నిజమే.. తను నమ్మిన ఇజాన్ని.. జనం కోసం తన తపనను.. ప్రతి ఫ్రేములోనూ ఆవిష్కరిస్తూ.. ఎప్పటికైనా మన వ్యవస్థలో కాస్తయినా మార్పు రాకపోతుందా అని ఎదురుచూపులు చూస్తున్న స్వచ్చమైన తెలుగోడు ఆర్. నారాయణ మూర్తి.
ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించిన నారాయణ మూర్తి.. తెలుగు తెరపై విప్లవాత్మక భావాల ఎర్రదనాన్ని ప్రజారంజకంగా అద్దుతూ వస్తున్నారు. సినిమా హీరో అవ్వాలని వచ్చి.. అవకాశాలు దొరకకపోయినా విసుగు చెందకుండా..దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తూ సినిమాకి సంబంధించిన విశేషాలు నేర్చుకున్నారు నారాయణ మూర్తి. తన స్నేహితుల సహాయంతో తానే నిర్మాతగా మారి.. స్నేహ చిత్ర బేనర్ పై’ అర్ధరాత్రి స్వతంత్రం’ అంటూ ఒక్కసారిగా విప్లవాత్మక ఆలోచనలను వినూత్నంగా తనదైన శైలిలో ఆవిష్కరించారు. హీరో అంటే ఇలానే ఉండాలి అనే మూస పద్ధతికి వ్యతిరేకంగా ఇలా ఉన్నా హీరోనే అనిపించుకున్నారు నారాయణ మూర్తి. డబ్బుల లెక్కలు పక్కన పెడితే.. నారాయణ మూర్తి సినిమాలు ప్రజల్లో సృష్టించిన ప్రభంజనం లేవేలే వేరు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది రంగుల ప్రపంచంలో దాదాపు అసాధ్యం. ఒదిగి ఉండటం అనే పదానికి నిజమైన అర్ధం చూపించిన వారు నారాయాణ మూర్తి. తన బాట నుంచి నడక.. నడత ఎక్కడా పక్కకు జరగలేదు. హీరోగా నటించిన 26 సినిమాల్లో పడి సినిమాలు సూపర్ హిట్.. అవి అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దీవిటీలు, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగుచుక్కలు. నటించిన పది సినిమాలూ ఫ్లాప్ అయినా హీరో అనే ట్యాగ్ తో సినిమా ఇండస్ట్రీలో కాలర్ ఎగరేసే నటుల్లా.. ఒక్క సినిమా హిట్ అయితే, రెమ్యునరేషన్ పెంచేసే నటుల్లా ఎప్పుడూ గాలిలో తెలిపోలేదు నారాయణ మూర్తి. ముందే చెప్పినట్టు విజయం.. అపజయం రెండూ ఆయనలోని ఒద్దికకు లాల్ సలాం చేసి గౌరవం ఇస్తాయి.
టీవీలో చిన్న యాంకర్ గా ఓ నాలుగు షోలు చేసిన వెంటనే పడవలాంటి కారులో పరుగులు తీసే ఈరోజుల్లో.. ఇండస్ట్రీలో దాదాపుగా ఏభై ఏళ్ళు పూర్తి కావస్తున్నా.. ఇప్పటికీ షేర్ ఆటోలోనే స్తూదియోలకు చేరుకునే ఏకైక వ్యక్తి నారాయణ మూర్తి ఇదొక్కటి చాలు ఆయన తీరు చెప్పడానికి. చెప్పుకుంటూ పోతే నారాయణ మూర్తి ఆదర్శ వ్యవహార శైలి ఒక గ్రంధం అవుతుంది. అరుదుగా ఉండే ఇటువంటి ఆదర్శం.. పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ ఆయన తన భావాల గురించి ఏమి చెప్పారో అయన మాటల్లోనే సంక్షిప్తంగా..
ఇవి కూడా చదవండి: Dry List 2022: మద్యం షాపులకు కూడా సెలవులు ఉంటాయని మీకు తెలుసా..? ఏయే రోజుల్లో మూసి ఉంటాయి..!
Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తొలి మరణం.. నైజీరియా నుంచి వచ్చాడన్న అధికారులు.. 1200 దాటిన కేసులు..!
Ration Card: రేషన్ కార్డు, ఇళ్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త వ్యవస్థ..!