AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా ప్రివ్యూ చూసి అందరూ సైలెంట్‌గా వెళ్లిపోయారు.. కట్ చేస్తే 100 రోజులు ఆడింది.. ఇప్పటికీ సెన్సేషన్

పరుచూరి పలుకులు కార్యక్రమంలో భాగంగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ, విలక్షణ నటుడు మోహన్ బాబుతో తన అనుబంధాన్ని, సినిమా ప్రయాణాన్ని పంచుకున్నారు. వారి కాంబినేషన్‌లో "అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా" వంటి పవర్ఫుల్ డైలాగులు తరతరాలుగా గుర్తుండిపోయాయని ఆయన అన్నారు.

సినిమా ప్రివ్యూ చూసి అందరూ సైలెంట్‌గా వెళ్లిపోయారు.. కట్ చేస్తే 100 రోజులు ఆడింది.. ఇప్పటికీ సెన్సేషన్
Paruchuri Gopala Krishna
Rajeev Rayala
|

Updated on: Jun 05, 2026 | 9:20 PM

Share

టాలీవుడ్ ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ, నటుడు మోహన్ బాబుతో తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని, వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఓ వీడియోలో పంచుకున్నారు. మోహన్ బాబు మాట నిలబెట్టుకునే తత్వాన్ని, ఆయన సినీ జీవితంలో మైలురాళ్లుగా నిలిచిన చిత్రాల వెనుకటి కథలను పరుచూరి ఆసక్తికరంగా పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. వారిద్దరి కాంబినేషన్ అనగానే “అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా” అనే ప్రసిద్ధ డైలాగ్ గుర్తుకొస్తుందని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. అయితే, వారి మొదటి ప్రయత్నం 1981లో “అగ్నిజ్వాల”తో జరగాలని ఉన్నా, అది సాధ్యపడలేదు. చిరంజీవి, విజయకాంత్ వంటి నటులను మొదట భావించినా, చివరకు ఆ పాత్రను మోహన్ బాబు, నరేష్ పోషించారు. ఆ తర్వాత మోహన్ బాబుతో చేసిన “సవాల్” ఆశించిన విజయాన్ని సాధించలేదని ఆయన గుర్తు చేసుకున్నారు.

వారి కలయికలో నిజమైన అద్భుతం “అసెంబ్లీ రౌడీ” చిత్రంతో మొదలైంది. ఈ సినిమా తమిళ చిత్రం “వేలైకారన్” స్ఫూర్తితో రూపొందింది. దర్శకుడు బి. గోపాల్, పరుచూరి గోపాలకృష్ణ ఆమోదిస్తేనే ఈ సినిమా చేస్తానని మోహన్ బాబుకు చెప్పడం, మోహన్ బాబు వి.హెచ్.ఎస్ క్యాసెట్ చూసి, ఇంటర్వెల్ తర్వాత ఎన్నికల నామినేషన్ సన్నివేశం చూడగానే చాలా బాగుంది అని చెప్పడం లాంటి సంఘటనలను గోపాలకృష్ణ వివరించారు. ఆ తర్వాత సవేరా హోటల్ 401 గదిలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభించి, అర్థరాత్రి రెండు గంటల వరకు స్క్రిప్టును పూర్తిగా రాసి, కాగితాలపైనే నిద్రపోయి, మళ్లీ తెల్లవారుజామున లేచి పూర్తి చేశానని ఆయన తెలిపారు. చిత్ర బృందం అక్షరం మార్చకుండా ఆ స్క్రిప్టును చిత్రీకరించడం విశేషమని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు.

సినిమా ప్రివ్యూ తర్వాత పరిశ్రమ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా, ప్రజలు ఈ సినిమాను అద్భుతంగా ఆదరించారని పరుచూరి తెలిపారు. సినిమా ప్రివ్వ్యూ చూసి అందరూ సైలెంట్ గా వెళ్లిపోయారు. దాంతో సినిమా పోయిందా అని అనుకున్నాం.. కానీ ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. మోహన్ బాబు స్వయంగా అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి, పూలమాల వేసి, “ఈ రోజు నుంచి నిన్ను, పెద్దాయనను అగ్రజా అనే పిలుస్తాను” అని చెప్పడం, ఆయన ఆ మాటను 26 ఏళ్లుగా నిలబెట్టుకోవడం మోహన్ బాబు గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని గోపాలకృష్ణ వివరించారు. “అసెంబ్లీ రౌడీ” చిత్రంలో ఒరిజినల్ స్క్రిప్టులో లేని కొన్ని సన్నివేశాలను తామే సృష్టించామని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. “అసెంబ్లీ రౌడీ” విజయం తర్వాత మోహన్ బాబుతో కలిసి షిరిడికి వెళ్లిన తర్వాత, కేవలం ఒకే ఒక గంటలో “రౌడీ గారి పెళ్ళాం” స్క్రిప్టును రాయాల్సి వచ్చిందని పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా కూడా అద్భుత విజయాన్ని సాధించింది. “అసెంబ్లీ రౌడీ” 100 రోజులు, “రౌడీ గారి పెళ్ళాం” 200 రోజుల వేడుకలను అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు సమక్షంలో నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారని ఆయన తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us