Paid Premieres: పెయిడ్ ప్రీమియర్స్.. చిన్న సినిమాలకు కలిసొస్తున్న నయా ట్రెండ్

టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే ట్రెండ్. 90 శాతం ఇది కలిసొస్తుంది కూడా. ఒక్కరోజు ముందు సినిమా చూపించడం అంటే అనుకున్నంత ఈజీ కాదు.. ఆ సినిమా భవిష్యత్తును ముందుగానే డిసైడ్ చేసే హక్కు ఆడియన్స్ చేతిలో పెట్టడమే.

Paid Premieres: పెయిడ్ ప్రీమియర్స్.. చిన్న సినిమాలకు కలిసొస్తున్న నయా ట్రెండ్
Tollywood

Edited By:

Updated on: Jul 14, 2023 | 10:49 AM

స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలాగైనా వస్తాయి.. అసలు తిప్పలన్నీ చిన్న సినిమాలకే. మొదటి రోజు థియేటర్స్‌కు ఆడియన్స్‌ను రప్పించడానికి నిర్మాతలకు తలప్రాణం తోకలోకి వచ్చేస్తుంది. అందుకే సింపుల్‌గా పెయిడ్ ప్రీమియర్స్ బాట పడుతున్నారు మేకర్స్. టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే ట్రెండ్. 90 శాతం ఇది కలిసొస్తుంది కూడా. ఒక్కరోజు ముందు సినిమా చూపించడం అంటే అనుకున్నంత ఈజీ కాదు.. ఆ సినిమా భవిష్యత్తును ముందుగానే డిసైడ్ చేసే హక్కు ఆడియన్స్ చేతిలో పెట్టడమే. అది కొన్నిసార్లు వర్కవుట్ అవ్వొచ్చు.. మిస్ ఫైర్ కూడా అవ్వొచ్చు. కానీ చిన్న సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి నిర్మాతలు మాత్రం ఇప్పుడిదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేయడం చిన్న సినిమాలకు బాగా కలిసొస్తుందిప్పుడు.

ఎక్కడివరకో ఎందుకు.. తాజాగా విడుదలైన బేబీ సినిమాకు ముందు రోజే ప్రీమియర్స్ వేసారు. SKN నిర్మించిన ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకుడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లాంటి అప్‌కమింగ్ ఆర్టిస్టులున్న ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ బాగా హెల్ప్ అయ్యాయి. సినిమాపై నమ్మకం పెంచడమే కాదు.. ఓపెనింగ్స్ భారీగా రావడానికి దోహదపడుతున్నాయి.

సామజవరగమనా ఈ రోజు ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందంటే కారణం పెయిడ్ ప్రీమియర్స్. నిజానికి శ్రీ విష్ణు సినిమా అంటే మొదటిరోజు ఆడియన్స్ థియేటర్స్‌కు వచ్చేది తక్కువే. కానీ సామజవరగమనాకు రిలీజ్‌కు 3 రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేసారు.. అన్నిచోట్లా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో.. తొలిరోజు పాజిటివ్ టాక్‌తో ఓపెన్ అయింది. ఇప్పటికే ఈ సినిమా 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో చాలా చిన్న సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ బాగా కలిసొచ్చాయి. మేం ఫేమస్, బలగం, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలకు రిలీజ్‌కు ఒకట్రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేసారు మేకర్స్. ఫుల్ పాజిటివ్ టాక్‌తో విడుదలై భారీ వసూళ్లు సాధించాయి. అలాగే మేజర్, సార్, ఘాజీ సినిమాలకు సైతం ప్రీమియర్స్ బాగా కలిసొచ్చాయి. కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాలకు ముందు రోజే ప్రీమియర్స్ వేస్తున్నారు.

ప్రీమియర్స్ వల్ల అన్నీ లాభాలే ఉంటాయనుకోలేం. కొన్నిసార్లు నష్టాలు కూడా తప్పవు. మొన్నీమధ్యే నాగశౌర్య రంగబలికి ప్రీమియర్స్ ఫార్ములా వర్కవుట్ అవ్వలేదు.. అలాగే అప్పట్లో ఫలక్‌నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలకు ప్రీమియర్స్ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.