దాదాపు పదేళ్ల క్రితం తెలుగులో రిలీజ్ అయిన హారర్ కామెడీ సినిమా గీతాంజలి. ఈ మూవీకి గతంలో సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇందులో అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, రవి శంకర్ కీలకపాత్రలలో కనిపించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ నిర్మాణంలో శివ తుర్లపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ కాగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 11న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈరోజు గీతాంజలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోన వెంకట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు తన రైటింగ్స్ తో భాగమయ్యారు కోన వెంకట్. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. వీరిద్దరి కాంబోలో సాంబ, అదుర్స్, బాద్ షా, జై లవకుశ సినిమాలు వచ్చాయి. అందులో ఇప్పటికీ అడియన్స్ కు తెగ నచ్చిన సినిమా అదుర్స్. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో తారక్ నటన చూసి విమర్శకులు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువస్తామన్నారు కోన వెంకట్. ఈ మూవీ సీక్వెల్ కోసం అవసరమైతే తారక్ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తా అన్నారు.
గీతాంజలి ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడుతూ.. “అదుర్స్ సినిమాలో చారిగా ఎన్టీఆర్ చేసిన నటన ఇంకెవరు చేయలేరు. ఆ సినిమాకు సీక్వెల్ తీసుకురావాలని ఎప్పటినుంచో ఉంది. ఆ సీక్వెల్ కథ రాసుకున్న తర్వాత ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసి అయినా తారక్ ను ఆ సీక్వెల్ కు ఒప్పిస్తాను ” అని అన్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అదుర్స్ సీక్వెల్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇందులో చారి పాత్రలో ఎన్టీఆర్ నటనకు అడియన్స్ ఎంతో ఎంజాయ్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.