AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

O Sukumari Review: ఈ సుకుమారిని ముట్టుకుంటే షాకే.. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే..?

ఒంట్లో కరెంట్ ఉండి ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి అనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'ఓ సుకుమారి' సినిమా ఐడియా పరంగా ఆకట్టుకుంటుంది. ఐశ్వర్య రాజేష్ నటన, తిరువీర్ అమాయకపు పెర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. అయితే ..

O Sukumari Review: ఈ సుకుమారిని ముట్టుకుంటే షాకే.. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే..?
Thiruveer, Aishwarya Rajesh in O Sukumari Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 3:16 PM

Share

మూవీ రివ్యూ: ఓ సుకుమారి

నటీనటులు: తిరువీర్, ఐశ్వర్య రాజేష్, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ గవిరెడ్డి, జీవన్, ఆమని, ఆనంద్, ఝాన్సీ, అంజి మామ తదితరులు

సినిమాటోగ్రఫీ: CH కుషేందర్

సంగీతం: భరత్ మంచిరాజు

ఎడిటర్: శ్రీ వరప్రసాద్

నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: భరత్ దర్శన్

సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, పరేషాన్, ప్రీ వెడ్డింగ్ షో లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తిరవీర్ జంటగా నటించిన సినిమా ఓ సుకుమారి. భరత్ దర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం డిఫెరెంట్ కథతో వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

మహారాష్ట్ర నుంచి కరీంనగర్ జిల్లా ధూమ్ పల్లి అనే గ్రామానికి సుకుమారి ఉరఫ్ దామిని (ఐశ్వర్య రాజేష్) తన తండ్రితో కలిసి వస్తుంది. పుట్టుకతోనే వింత సమస్యతో పుట్టిన దామినికి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్‌లు వస్తుంటాయి. ఈ వింత సమస్య ఉన్న దామినికి చిన్నపుడు అమ్మ ప్రేమ కూడా దూరం అవుతుంది. అదే సమయంలో ఆమె దగ్గరికి రావాలంటేనే అందరూ భయపడుతుంటారు. ఆ సమయంలో దామినిని తొలిచూపులోనే చూసి ఇష్టపడతాడు యాదగిరి (తిరువీర్). నిజం దాచేసి అతడికి ఇచ్చి ఊరు మొత్తం ఏకమై పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత వాళ్ల జీవితంలో ఎలాంటి అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి.. నిజం తెలిసాక యాదగిరి ఏం చేసాడు.. దామిని ప్రేమను వదిలేసుకున్నాడా లేదంటే ఆ సమస్యను ఎలా తగ్గించాడు అనేది అసలు కథ..

కథనం:

ఒంట్లో కరెంట్ ఉండి ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి అనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఓ సుకుమారి సినిమా ఐడియా పరంగా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించినప్పటికీ.. తెరపై ప్రెజెంట్ చేయడంలో మాత్రం అక్కడక్కడా తడబడినట్లు అనిపిస్తుంది. ఆలోచన మాత్రం అదిరిపోతుంది. సీన్స్ పరంగా ఈ వైవిధ్యమైన పాయింట్‌ను ఇంకా బలంగా రాసుకుని ఉంటే కచ్చితంగా ఇదొక మైండ్‌బ్లోయింగ్ సూపర్ ఉమెన్ సినిమా అయ్యుండేది. అక్కడక్కడా పండిన కామెడీ ఊరటనిచ్చే విషయం. ముఖ్యంగా హీరోయిన్ ఒంట్లో కరెంట్ ఉండటం, ఎవరిని తాకినా షాక్ కొట్టడం అనేదే ఈ సినిమాకు మెయిన్ ప్లాట్ అయినప్పుడు.. దాని చుట్టూ మరింత క్రేజీ ఫన్ జనరేట్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు ఆ అవకాశాన్ని అంతగా వాడుకోలేకపోయాడు అనిపించింది. సినిమా మొదలైనప్పటి నుండి కథనం బాగానే సాగుతుంది.. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ప్రేక్షకుడికి అసలైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త పర్వాలేదనిపిస్తూ కథను ముందుకు నడిపించగా, క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా బాగానే మెప్పిస్తుంది. ఈ షాక్ కొట్టడం అనే వింత కాన్సెప్ట్ చుట్టూ దర్శకుడు రాసుకున్న కొన్ని సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులను బాగానే అలరిస్తాయి. ముఖ్యంగా హీరోయిన్ తాకినప్పుడు కొన్నిసార్లు షాక్ కొట్టడం, మరికొన్ని కీలక పరిస్థితుల్లో అసలు షాక్ కొట్టకపోవడం అనే ట్విస్టుల చుట్టూ అల్లుకున్న స్క్రీన్‌ప్లే మైండ్ గేమ్‌లా సాగుతూ ఆకట్టుకుంటుంది. వీటన్నింటికీ మించి అసలు ఆ అమ్మాయి ఒంట్లోకి అంత కరెంట్ ఎలా వచ్చింది, ఆ షాక్ వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే మెయిన్ పాయింట్‌ను చివర్లో ఎమోషనల్‌గా అమ్మ ప్రేమతో ముడిపెట్టి ముగించిన విధానం థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడి మనసుకు కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది.

నటీనటులు:

షాక్ ఇచ్చే సుకుమారిగా ఐశ్వర్య రాజేష్ అదరగొట్టింది. తన న్యాచురల్ యాక్టింగ్ ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్. తిరువీర్ మరోసారి తనదైన అమాయకపు నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హీరోయిన్‌తో వచ్చే సీన్స్ అన్నీ బాగా ఆకట్టుకున్నాయి. మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ గవిరెడ్డి, ఆమని, ఆనంద్, ఝాన్సీ, అంజి మామ ఇలా ఎవరికి వాళ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడు భరత్ మంచిరాజు పాటలు పర్లేదు.. ఆర్ఆర్ కూడా బాగానే అనిపిస్తుంది. కుషేందర్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. విలేజ్ సెటప్ అంతా సినిమాలో బాగా ఎస్టాబ్లిష్ చేసారు. ఎడిటింగ్ ఓకే.. అక్కడక్కడా కొన్ని సీన్స్ తీసేయొచ్చు కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటర్‌ను తప్పుబట్టలేం. నిర్మాత కథ మేరకు ఖర్చు పెట్టారు. దర్శకుడు భరత్ దర్శన్ తీసుకున్న ఐడియా బాగున్నా.. ఎగ్జిగ్యూషన్ మీద ఇంకాస్త ఫోకస్ చేసుంటే బాగుండేది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఓ సుకుమారి.. షాకుల సుందరి.. నవ్వుకోడానికి ఓకే..!

Follow Us