
హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై యూట్యూబ్ ఛానెల్స్ థియేటర్ ఆవరణలోకి రాకుండా నియంత్రణ విధించింది. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ బయట పబ్లిక్ టాక్ తీసుకోవడంపై అనుమతి నిరాకరించింది. మల్టీప్లెక్స్ గేటు లోపలికి యూట్యూబ్ ఛానల్స్ కెమెరాలను సైతం రానివ్వడం లేదు. ఈ నిర్ణయం పై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో ఇక సినిమాలను తాము ప్రశాంతంగా చూసి రావొచ్చని.. కెమెరాస్, మైకుల గోల ఉండదని అంటున్నారు సినీ ప్రియులు.
అయితే ప్రసాద్ మల్టీప్లెక్స్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇటీవల జరిగిన గొడవ అనే తెలుస్తోంది. ఆదిపురుష్ విడుదల సమయంలో ఓ ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని నిర్మోహ్మమాటంగా చెప్పేశాడు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది ఫ్యాన్స్ అతడిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. థియేటర్ ఆవరణలోనే అతడిని కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
నిజానికి కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు.. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద పలు యూట్యూబ్ ఛానల్స్ రివ్యూల కోసం పడిగాపులు గాస్తారు. మొదటి రోజు ఫస్ట్ షో చూసి వచ్చిన ప్రేక్షకుల ముందు మైక్స్ పెట్టి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. కొందరు రివ్యూ ఇవ్వడం ఇష్టంలేక పక్కకు తప్పుకుని వెళ్లగా.. మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్ తీసుకున్న నిర్ణయం పై సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు మూవీ లవర్స్.