MAA Elections: ప్రకాష్ ‘రాజ్ కీయం’… బండ్ల బ్లేడ్ ఎటాక్… మధ్యలో మెగా ట్విస్ట్…!

|

Sep 06, 2021 | 12:51 PM

Telugu Cinema News: వెన్నుపోట్లు, వేరుకుంపట్లు, తిరుగుబాట్లు, ఎత్తుకు పైఎత్తులు, ఫ్రీబీస్, ఆపరేషన్ ఆకర్ష్... ఇవన్నీ రెగ్యులర్ పాలిటిక్స్ లో మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు సినిమా వాళ్ళ ఎన్నికలు అంతకుమించిన మసాలాతో నషాళానికి ఎక్కేస్తున్నాయి.

MAA Elections: ప్రకాష్ రాజ్ కీయం... బండ్ల బ్లేడ్ ఎటాక్... మధ్యలో మెగా ట్విస్ట్...!
Maa Elections
Follow us on

Tollywood News – MAA Elections: వెన్నుపోట్లు, వేరుకుంపట్లు, తిరుగుబాట్లు, ఎత్తుకు పైఎత్తులు, ఫ్రీబీస్, ఆపరేషన్ ఆకర్ష్… ఇవన్నీ రెగ్యులర్ పాలిటిక్స్ లో మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు సినిమా వాళ్ళ ఎన్నికలు అంతకుమించిన మసాలాతో నషాళానికి ఎక్కేస్తున్నాయి. ఎస్… మూవీ ఆర్టిస్టుల సంఘంలో పాచికలాట జోరుగానే మొదలైంది. అక్కడ జరిగే ఎత్తుగడలు… ట్రెడిషనల్ పొలిటిషియన్లను కూడా పిచ్చెక్కిస్తున్నాయి. మీడియాలో మాట్లాడనంత మాత్రాన.. షూటింగ్ లో గాయపడి ఆస్పత్రిలో ఉన్నంత మాత్రాన.. చేతులు ముడుచుకుని కూర్చోలేదని ప్రూవ్ చేశారు ప్రకాష్ రాజ్. ‘మా’ ఎన్నికల్ని తాను తేలిగ్గా తీసుకోలేదని సెకండ్ ప్రెస్ మీట్ ద్వారా సిగ్నల్ ఇచ్చారు మోనార్క్. ఆల్రెడీ పాలిటిక్స్ తో పరిచయం వుంది కనుక.. ‘మా’ ఎన్నికల్లో కూడా తన రాజకీయ అనుభవాన్ని ప్రయోగిస్తూ… దృశ్యాన్ని బాగా రక్తి కట్టించేశారాయన.

జయసుధను ఎలాగోలా ఒప్పించి ప్యానల్ నుంచి పక్కకుబెట్టారు. సెపరేట్ గా ఫైట్ చేస్తానన్న జీవితకు జనరల్ సెక్రటరీ పోస్ట్ ని ఎరగా వేసి… సొంత ప్యానెల్ లోకి లాగేశారు. అయినా ఆమెను కన్విన్స్ చెయ్యడానికి గంటసేపు మాట్లాడాల్సి వచ్చిందని ప్రకాష్ రాజే ఓపెన్ గా చెప్పారు. ఫస్ట్ కిక్ తోనే రెబల్ స్టార్ అనిపించుకున్న హేమను కూడా ఎలాగోలా ఎట్రాక్ట్ చేసి… ఏకంగా వైస్ ప్రెసిడెంట్ కుర్చీనిచ్చేశారు. ఇలా సినిమా బిడ్డల జాబితాలో బలమైన మార్పులు చేసి.. విష్ణుకు బిగ్ ఛాలెంజే విసిరారు ప్రకాష్ రాజ్.

కానీ… రాజకీయం తనకొక్కడికే తెలుసు అనుకుంటే ఎలా? మన బిడ్డడే అనుకున్న బండ్ల గణేశుడు.. గుండెల మీద తన్ని వెళ్లిపోయారు. నన్ను పక్కన పెట్టి జీవితా రాజశేఖర్ ని నెత్తికెత్తుకోవడం ఏంటని నిలదీస్తూ.. వేరుకుంపటి పెట్టేశారు మిస్టర్ బండ్ల. మెగాస్టార్ ఫ్యామిలీ తనవైపే ఉందని చెప్పడం ద్వారా ప్రకాష్ రాజ్ ఓటు బ్యాంకుకు గండి పడ్డం గ్యారంటీ అనే ఫీలర్ ఇచ్చారు బండ్ల గణేష్. తాను గెలవకపోయినా పర్వాలేదు… జీవిత ఓడితే చాలు అనేది బండ్ల టార్గెట్. దీన్ని మోనార్క్ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి!

నాకు ఓటేస్తే వంద మంది సభ్యులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తా… అని కేసీఆర్ రేంజ్ లో తాయిలాలు ప్రకటించారు బండ్ల. ‘మా’ భవనం మేమే కట్టిస్తాం.. స్థలం కూడా వెతుకుతున్నాం అని అరచేతిలో స్వర్గాలు చూపిస్తున్నారు మంచు విష్ణు. మరి.. ప్రకాష్ రాజ్ ఏం చేస్తారు? నేను చిన్న ఆర్టిస్టుని… నా చేతిలో అన్ని పైసల్లేవు అని ముందే చేతులెత్తేశారాయె. మరి.. ఇప్పటికైనా కేజ్రీవాల్ లాగా చీపురు తిరగేస్తారా లేక.. అన్నా హజారే లెక్కన ఊరికే దీక్షలు గట్రా చేస్తారా?

మా ఎలక్షన్ డేట్ అనౌన్స్ అయ్యీకాగానే వేడెక్కిన సినిమా రాజకీయాలు… పోలింగ్ సమయానికి ఏ రంగు పులుముకుంటాయి? క్లయిమాక్స్ ఎలా వుండబోతోంది? ఏదేమైనా మీసం మెలేసి తొడలు కొట్టుకునే పొలిటికల్ లీడర్ల సీన్లకు ఏమాత్రం తీసిపొయ్యేలా లేదు ఈ సిని’మా’ పరిస్థితి. జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రటరీగా గెలిస్తే.. అది మెగా ఫ్యామిలీ ఓటమిగా భావించాల్సి వస్తుందని ఇప్పటికే సన్నిహితులతో చెప్పేశారట బండ్ల గణేష్ స్టేజ్ నెక్కితే చాలు జూలు విదిల్చే బండ్ల… రేపటినుంచి సైలెంట్ గా ఉంటారని మాత్రం ఎవ్వరూ అనుకోరు.

‘మా’ యుద్ధంలో మంచు ఫ్యామిలీ రాసుకోబోయే తాజా వ్యూహం ఏమిటి.. మోనార్క్‌ని ఎదుర్కొనే విష్ణు మాయ ఎలా వుండబోతోంది…? అనేది కూడా వెరీ ఇంట్రస్టింగ్. ఘట్టమనేని కాంపౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేసిన మంచు కుటుంబం.. నిన్న గురుపూజోత్సవం అంటూ నరేష్ కి దండేది సన్మానం చేసింది. రేపోమాపో… విష్ణు ‘బిడ్డల’ జాబితా కూడా బైటికొస్తే… అసలు సిని’మా’ అప్పుడు కదా మొదలయ్యేది?

– రాజా శ్రీహరి, TV9 Telugu ET డెస్క్

Also Read..

Kriti Sanon: మీడియా‌పై మండిపడ్డ బాలీవుడ్ బ్యూటీ.. అమ్మడి కోపానికి కారణం ఏంటో తెలుసా..

Bigg Boss 5 Telugu: అప్పుడే బిగ్‏బాస్ హౌస్‏లో డ్రీమ్ గళ్‏ను వెతుక్కునే పనిలో సన్నీ.. ఆ ఇద్దరితో..