సాహస వీరులైన మేకర్స్.. పాపం.. అందరినీ నిండా ముంచిన అమరేంద్ర బాహుబలి…!?

|

Aug 28, 2021 | 7:10 AM

తెలుగు సినిమా బార్డర్లు తెగ్గొట్టి నార్త్‌ మార్కెట్లను కూడా కొల్లగొట్టిన బాహుబలి సినిమా మనకొక గర్వకారణం. ఇందులో డౌటే లేదు.

సాహస వీరులైన మేకర్స్.. పాపం.. అందరినీ నిండా ముంచిన అమరేంద్ర బాహుబలి...!?
Bahubali
Follow us on

తెలుగు సినిమా బార్డర్లు తెగ్గొట్టి నార్త్‌ మార్కెట్లను కూడా కొల్లగొట్టిన బాహుబలి సినిమా మనకొక గర్వకారణం. ఇందులో డౌటే లేదు. ఆల్‌టైమ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా వెయ్యి కోట్ల మార్క్‌ని టచ్ చేసి… ఉత్తరాది మేకర్స్‌ కూడా ఈర్ష్య పడేలా చేసిన బాహుబలికి.. మరో పార్శ్యం కూడా వుంది. ఇప్పుడు పరిశ్రమ పడుతున్న కష్టనష్టాలకు అసలు కారణం కూడా ఆ బాహుబలి మాత్రమే. ఎలా…?

మంచి క్వాలిటీ సినిమాను భారీ స్థాయితో తీసి.. ఒక పద్ధతి ప్రకారం అమ్ముకుంటే ఎంతెంత వసూళ్లు దండుకోవచ్చో కళ్లకు కట్టినట్టు నిరూపించిన మూవీ బాహుబలి. మంచి సినిమా తియ్యడం దగ్గరే ఆగిపోకుండా మార్కెట్ లెక్కల్లో కొత్త కొత్త కార్నర్స్‌ని పరిచయం చేసి.. తెలుగు సినిమా పరిధిని పెంచి చూపెట్టారు జక్కన్న. ఇదేవిధంగా లోకల్ టు గ్లోబల్‌ కొత్త రూట్లేసుకుని మనం కూడా బ్రహ్మాండం బద్దలుకొట్టేద్దాం అని మిగతా మేకర్స్ కూడా సాహస వీరులుగా మారిపోయారు.

దాని ఫలితమే… ఇప్పుడు ఇండియన్ సెల్యులాయిడ్ మొత్తమ్మీద డజనుకు పైగా పాన్ ఇండియా మూవీస్ పట్టాల మీదున్నాయి. వీటిలో మేజర్ స్టేక్… తెలుగు వాళ్లదే. ఒక్క ప్రభాస్‌ని నమ్ముకునే నాలుగు నేషనల్ ప్రాజెక్టులు షూటింగ్ దశలో వున్నాయి. పదిహేనొందల కోట్ల దాకా పెట్టుబడి పెట్టి… ప్రభాస్‌లో మరో బాహుబలిని చూసుకుంటున్నారు నిర్మాతలు.

ఏం…. మనం మాత్రం ఆ కుంభస్థలాన్ని ఎందుకు కొట్టలేం అని మిగతా బేనర్లు కూడా దుస్సాహసానికి ఒడిగట్టేశాయి. వీటిలో ఒరిజినల్ పాన్ ఇండియా సినిమాలెన్ని… సూడో పాన్ ఇండియా సినిమాలెన్ని అనే లెక్క… కొంచెం లోతుల్లోకెళితే తెలిసిపోతుంది. తమతమ కథల మీద కృత్రిమంగా కాన్ఫిడెన్స్‌ పెంచుకుని కోట్లు కుమ్మరించి ప్రొడ్యూస్ చేస్తున్న వీళ్లందరి హోప్స్ మాత్రం ఆ మల్టిలింగువల్ మార్కెట్స్‌ మీదే.

పాన్ ఇండియా అనే ఈ దేవతావస్త్రాన్ని చూసుకుంటూ… గాల్లో తేలిపోతున్న మేకర్స్ అందరినీ అకస్మాత్తుగా దెబ్బేసింది కరోనా మహమ్మారి. కోవిడ్ కారణంగా కకావికలమైన సెకండ్ క్యాలెండర్‌ ఇయర్‌ ఇది. వేవ్ తర్వాత వేవ్‌ ముంచుకొచ్చి… ఫ్యూచర్ మీద ఎవ్వరికీ క్లియర్‌ పిక్చర్ లేకుండా పోయింది. ఓ మోస్తరు సినిమాలు కూడా థియేటర్ రిలీజ్‌ వైపు చూడ్డానికి భయపడిపోతున్నాయి. డేటిచ్చి వెనక్కు తీసుకున్న లవ్‌స్టోరీ సినిమానే ఇక్కడో చిక్కటి ఉదాహరణ. ట్రిపులార్ డేట్‌ మీద జక్కన్న కసరత్తు కంటిన్యూస్ అనే న్యూస్ కూడా మరోవైపు వెక్కిరిస్తూనే వుంది.

మహారాష్ట్రలో థియేటర్లు మూతబడ్డాయని తెలిసినా రిస్క్‌ చేసి రిలీజైన బెల్‌బాటమ్‌ సినిమా పదిశాతం వసూళ్లు కూడా సాధించలేకపోయింది. వారం గడిచినా.. ఐదారు కోట్ల దగ్గరే ఆగిపోయిన కలెక్షన్స్‌… హీరో అక్షయ్ కుమార్‌ని మొహం చాటేసేలా చేస్తున్నాయి. రాధే సినిమాను ఓటీటీకిచ్చి అభాసుపాలైన సల్మాన్ ఖాన్ కథ వుండనే వుంది.

బీటౌన్‌లో మెగా మల్టిస్టారర్ సూర్యవంశీ… ఏడాదిన్నర కిందటే షూటింగ్ పూర్తయినా రిలీజ్ విషయంలో చప్పుడు చెయ్యడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలు షేర్షా, భుజ్… పంద్రాగస్టు సీజన్‌లో సైలెంట్‌గా డిజిటల్‌ రిలీజ్‌తో సరిపెట్టుకున్నాయి. పెట్టిన ఖర్చులో ఎంత శాతం రిటర్న్స్‌ వచ్చాయన్న లెక్కల్ని అడిగేవాడూ లేడు.. చెప్పేవాడూ లేడు. టోటల్‌గా ఈ ఏడాది థియేటర్లు మూతబడ్డంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పడ్డ గండి… వెయ్యి కోట్లకు పైమాటే అన్నది ఒక అంచనా.

ప్రస్తుతానికి తెలుగులోనే… వందల కోట్ల భారీ బడ్జెట్‌ సినిమాలు… ఒక్కో హీరో చేతిలో రెండుమూడుకు తగ్గకుండా వున్నాయి. దసరా పోతే దీపావళి, అదీ పోతే క్రిస్మస్.. ఆ తర్వాత సంక్రాంతి… సీజన్లయితే రెడీగా వున్నాయి. కానీ.. ఏ సీజన్‌కి థియేటర్ల దగ్గర రద్దీ వాతావరణం కనిపిస్తుందన్న పర్‌ఫెక్ట్ గెస్సింగ్స్ మాత్రం ఎవ్వరి దగ్గరా లేవు. సో… పాతిక ముప్పై కోట్ల ఖర్చుతో తీసిన సినిమాలే టేబుల్ ప్రాఫిట్‌ని ఆశించలేక భంగపడుతున్నాయి. మరి.. వందా రెండువందల కోట్ల సైజున్న పెద్ద సినిమాలు… లాభాల్లోకి వచ్చే మార్గమెక్కడ…? ఇంతటి బరువైన ఖరీదైన అనర్థానికి అసలు కారణం… అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టిన అమరేంద్ర బాహుబలేగా…? అంటూ గత వైభవాన్ని తవ్వి చూసుకుంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.

– రాజా శ్రీహరి, Tv9 Telugu – ET డెస్క్

Also Read..

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఫ్రీ ఇంటర్నెట్‌.. ఉచిత సేవలను ఇలా పొందండి. యాక్ట్‌ యూజర్లకు ప్రత్యేకంగా..

Vaccination : ఒక్క రోజే రికార్డు స్థాయి వ్యాక్సినేషన్.. అభినందనలు తెలిపిన మోడీ