
రామ్ చరణ్.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న టాప్ హీరోల్లో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత రంగ స్థలం, ధ్రువ, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లోనూ నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఆర్ఆర్‌ఆర్‌తో గ్లోబల్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్నాడు రామ్ చరణ్. సినిమా రంగంలో గ్లోబల్ స్టార్ అందుకున్న ఘనతలకు గుర్తింపుగా ఇటీవల లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియంలో చరణ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కు రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. అంతేకాదు రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. రామ్ చరణ్ జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ రూపొందనుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గత ఆరు నెలలుగా గ్లోబల్ స్టార్ డాక్యుమెంటరీపైనే వర్క్ చేస్తోందని సమాచారం. దీనికోసం కొన్ని సన్నివేశాలను కూడా ఇప్పటికే చిత్రీకరించారని చెబుతున్నారు. అయితే డాక్యుమెంటరీ సహజంగా ఉండేలా అన్నీ రియల్ సీన్లను ఇందులో జోడిస్తున్నట్లు సమాచారం.
కాగా ఈ ఏడాది ప్రారంభంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ రిలీజ్ సందర్భంగా, చాలా మంది మెగా అభిమానులు చెర్రీని కలవడానికి ఆయన ఇంటి వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫుటేజ్ ను కూడా డాక్యుమెంటరీలో వాడనున్నట్లు సమాచారం. కాగా గతంలో నెట్ ఫ్లిక్స్ లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితం ఆధారంగా ఒక డాక్యుమెంటరీ తీసింది. ఇది నయనతార వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని ప్రతిబింబించింది. అలాగే రాజమౌళి పై కూడా డాక్యుమెంటరీ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ డాక్యుమెంటరీ కూడా అలాంటిదే అవుతుందని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ నటించిన ‘RRR’ సినిమా 2023లో విడుదలై విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు అభిమానులను నిరాశపర్చాయి. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .