ఆయన, నేను కలిసినప్పుడు మాట్లాడుకునేవి… “నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు.. ఈ అక్కినేని.. ఆ….” అంటూ ప్లోలో మాట జారవిడిచారు బాలయ్య. ఆ రోజు దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. నెక్ట్స్ డే మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. తండ్రి స్థాయి వ్యక్తిని, తండ్రి స్థాయి నటుడ్ని బాలయ్య ఇలా ఎలా మాట్లాడాతారంటూ కామెంట్స్ మొదలయ్యాయి. ఒకనొక దశలో ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యారు బాలయ్య. సోషల్ మీడియా నిరసనలు కాస్తా.. రోడ్లపైకి వచ్చాయి. అక్కినేని ఫ్యాన్స్ బయటకు వచ్చి బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లి అర్జున్ థియేటర్ దగ్గర ఆల్ ఇండియా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించింది.
లెజెండరీ యాక్టర్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ క్షమాపణ చెప్పాలంటూ అనంతపురంలో ఏఎన్నార్ ఫ్యాన్స్ నిరసన చేపట్టారు. బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరు నర్తకి సెంటర్‌లో అక్కినేని ఫ్యాన్స్ నిరసన చేపట్టారు. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్యాన్స్ హర్టవ్వడంతో అక్కినేని వారసుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. కళామతల్లి ముద్దు బిడ్డల్ని అగౌరవపరచడం.. మనల్ని మనం కించపరుచుకోవడమే అని అటు చైతూ, అఖిల్ నోట్ విడుదల చేశారు.
ఈ బర్నింగ్ ఇష్యూపై తాజాగా సత్యసాయి జిల్లా హిందూపురంలో బాలయ్య స్పందించారు. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్‌లో యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప నాగేశ్వరరావు గారిని కించపరిచే విధంగా తానేం మాట్లాడలేదని తెలిపారు. ఏఎన్నార్ గారిని బాబాయ్ అని పిలుస్తానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ, ఏఎన్నార్ నుంచి పొగడ్తలకు పొంగిపోకూడదనే విషయాన్ని నేర్చుకున్నట్లు వివరించారు. అక్కినేని నాగేశ్వరరావు తన పిల్లల కంటే తననే ఎక్కువగా ప్రేమించేవారు బాలయ్య చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు కల్లలాంటివారని బాలయ్య అన్నారు. కొన్ని ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు. నాన్న చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగిందన్నారు బాలయ్య. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోనని గర్జించారు బాలయ్య.
కాగా చైతూ, అఖిల్ స్పందనపై బాలయ్య ఫ్యాన్స్ చిన్నబుచ్చుకున్నారు. బయటవాళ్లు సరే… బాలయ్య గురించి అన్నీ తెలిసిన అక్కినేని కుటుంబం కూడా ఇలా వ్యవహరించడం సరికాదంటూ తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగచైతన్యను యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేసే సమయంలో.. బాలయ్య స్టేజ్‌పై చేసిన కామెంట్స్ వైరల్ చేస్తున్నారు. వేదిక దొరికినప్పుడల్లా బాలయ్య అక్కినేని కుటుంబంపై తమ ప్రేమను చాటుకున్నాడని చెబుతున్నారు. 13 ఏళ్ల క్రితం నిర్వహించిన జోష్ ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడిన బాలయ్య… మాటలను వైరల్ చేస్తున్నారు.
It’s been almost 13 years so naturally, they forgot.#NandamuriBalakrishna pic.twitter.com/NlHjjgANCr
— Balayya Trends (@NBKTrends) January 24, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..