బాలయ్య మాస్ మసాలా యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయ్..! వరల్డ్ వైడ్‌గా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. దీంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది. తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ ఖుషీ మామూలుగా లేదు. డప్పులు, డ్యాన్సులతో జై బాలయ్య అంటూ హొరెత్తిస్తున్నారు. అమెరికా లేదు.. అనకాపల్లీ లేదు.. ఎక్కడైనా ఒకటే డైలాగ్ అన్నట్టుగా బాలయ్య అభిమానులు జాతరతో జబర్దస్త్ గా పండగ చేసుకుంటున్నారు.
వీరసింహారెడ్డి అదరగొడుతున్నాడు. వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో సందడి చేస్తున్నాడు. బాలయ్య మాస్ మసాలా డైలాగ్స్, యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ ఈలలు, కేకలతో పండగ ముందుగానే వచ్చినట్టు ఉంది. వీరసింహారెడ్డికి థియేటర్ల బయట కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు కాల్చుతూ, తీన్‌మార్ డ్యాన్స్‌లు చేస్తున్నారు. షోలు మొదలయ్యాక కూడా ఇదే తరహా సందడి కనిపించింది. బాలయ్య ఎంట్రీ సీన్స్, జై బాలయ్య పాట, పంచ్ డైలాగ్‌లు వచ్చినప్పుడు.. కాగితాలు ఎగురవేస్తూ సంబరాలు చేసుకొన్నారు.
ఇక కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు బాలకృష్ణ. ఆయన ఫ్యాన్స్ ఈలలు, కేకలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. అంతకుముందు సిటీలో దుమ్మురేపారు బాలయ్య ఫ్యాన్స్. నరేశ్, ఆర్కే, మనోజ్, భాను, రవి, దీపక్, సాయినాథ్‌తో పాటు పలువురు ఫ్యాన్స్ రాత్రి నుంచే హంగామా మొదలెట్టారు. మేళతాళాలతో, బాలయ్య స్లోగన్స్‌తో హోరెత్తించారు. జేఎన్టీయూ వద్ద ఉన్న అన్నగారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి.. భారీ ర్యాలీ తీశారు. ఆపై బాలయ్యతో కలిసి.. భ్రమరాంబ థియేటర్‌లో సినిమా చూశారు.
ఈ సినిమాతో బాలయ్యబాబు మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారంటూ ఊగిపోతున్నారు ఫ్యాన్స్. కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో బాలకృష్ణ కూతురు నారా బ్రహ్మణి అభిమానులతో కలిసి మూవీ చూశారు. సినిమాలో నాన్న డైలాగులు చాలా బాగున్నాయంటూ కొనియాడారు. నాన్న సినిమాలు అభిమానుల హంగామా మధ్య చూడటమే తనకు ఇష్టమని తెలిపారు.
వరల్డ్ వైడ్‌గా దాదాపు 1500 థియేటర్స్‌లో వీరసింహారెడ్డి సినిమా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో 875కు పైగా సినిమాల్లో సందడి చేస్తున్నాడు వీరసింహారెడ్డి. నైజామ్‌లో 265, సీడెడ్‌లో 2వందలకు పైగా థియేటర్స్, ఏపీలో 410కి పైగా థియేటర్స్‌లో మూవీని రిలీజ్ చేశారు. ఇక కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 90కి పైగా .. ఓవర్సీస్‌లో 5వందల థియేటర్స్‌లో వీరసింహారెడ్డి నందమూరి నట సింహం వీర విహారం చేసేస్తున్నాడు.