AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఊపిరి’ చిత్రంలో కార్తీ పాత్ర కోసం మొదట అనుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?

‘ఊపిరి’ సినిమాలో కార్తీ చేసిన కేర్‌టేకర్ పాత్రకు మరెవరూ సరిపోరని నాగార్జున తెలిపారు. మొదట ఈ పాత్ర కోసం ఎవర్ని సంప్రదించారో కూడా వివరించారు. అలాగే తన తనయుడు నాగ చైతన్యను తీసుకుంటే పాత్రలోని సహజత్వం, విశ్వసనీయత తగ్గిపోతుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్లు నాగార్జున వెల్లడించారు.

‘ఊపిరి’ చిత్రంలో కార్తీ పాత్ర కోసం మొదట అనుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?
Oopiri Movie Poster
Ram Naramaneni
|

Updated on: May 29, 2026 | 4:00 PM

Share

నాగార్జున తన కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన చిత్రాల్లో ‘ఊపిరి’ ఒకటి. తమిళంలో ‘తోఝా’గా విడుదలైన ఈ సినిమా.. భావోద్వేగాలు, స్నేహం, జీవితం పట్ల ఆశావాద దృక్పథాన్ని అద్భుతంగా చూపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే ఈ సినిమా నటీనటుల ఎంపిక గురించి నాగార్జున అప్పట్లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో కార్తీ నటన అద్భుతమని, ఆయన చేసిన కేర్‌టేకర్ పాత్రకు వేరొకరిని ఊహించలేమని నాగార్జున అన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత కార్తీ తప్ప ఆ పాత్రను మరెవరూ చేయలేరని తనకు బలంగా అనిపించిందని చెప్పారు.

అయితే మొదట ఈ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సంప్రదించారని నాగార్జున వెల్లడించారు. కానీ అప్పటికే ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ సెట్ కాలేదు. తన కోసం ఎదురు చూడకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ స్వయంగా సూచించడంతో దర్శకుడు వంశీ పైడిపల్లి, నాగార్జున షూటింగ్ ప్రారంభించారని చెప్పారు.

తన కుమారుడు నాగ చైతన్యను ఈ పాత్రకు ఎందుకు తీసుకోలేదో కూడా నాగార్జున వివరించారు. “చైతూ నా కుమారుడు కావడంతో.. అతను పేద నేపథ్యం నుంచి వచ్చిన కేర్‌టేకర్‌గా కనిపిస్తే ఆడియన్స్ పూర్తిగా నమ్మలేరు. ఆ విశ్వసనీయత కోల్పోతే కథ బలం తగ్గిపోతుంది” అని చెప్పారు.

ఫ్రెంచ్ చిత్రం ‘ది ఇంటచబుల్స్’ నుంచి స్పూర్తి పొందిన ఈ సినిమా.. భారతీయ భావోద్వేగాలకు తగ్గట్టుగా మలచబడింది. ధనికుడైన కానీ శారీరకంగా బలహీనుడైన వ్యక్తి జీవితంలోకి ఒక సాధారణ యువకుడు రావడం.. ఇద్దరి మధ్య ఏర్పడే బంధం.. జీవితాన్ని కొత్త కోణంలో చూడటం ఈ కథలో ప్రధాన బలం.

2016లో విడుదలైన ‘ఊపిరి’ కమర్షియల్‌గా కూడా మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున నటన, కార్తీ ఎనర్జీ, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, పీవీపీ బ్యానర్ నిర్మాణ విలువలు, గోపీసుందర్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా “స్నేహానికి భాష అవసరం లేదు” అనే భావనను ఈ సినిమా ఎంతో హృద్యంగా ప్రేక్షకులకు చేరవేసింది. ఇప్పటికీ ‘ఊపిరి’ తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో ఒక ఫీల్‌గుడ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us