Naga Chaitanya: ‘ఇకనైనా ఆ విషయాలను వదిలేస్తారనుకుంటున్నా’.. నాగచైతన్య కామెంట్స్ వైరల్..
నేను చేసే సినిమాల కంటే నా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇది దురదృష్టకరం.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ మూవీలో చైతూ.. ఏపీ అబ్బాయి బోడి బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లలో పాల్గొంటున్న చైతూకు.. సినిమా కంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సమంతతో (Samantha) పెళ్లి, విడాకులకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తుండడంతో చైతూ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తామిద్దరం విడిపోతున్నామని ప్రకటించి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ తన సినిమాల కంటే పర్సనల్ లైఫ్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని.. ఇకనైన ప్రజలు తన సినిమాల గురించి మాట్లాడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. ” నేను చేసే సినిమాల కంటే నా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇది దురదృష్టకరం. కానీ ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. కొన్ని మీడియా వర్గాలు మా వ్యక్తిగత జీవితంపై హెడ్డింగ్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి వారి వారి మార్గాలు ఉంటాయి. కష్టపడి పనిచేయడం నటుడిగా నా బాధ్యత. నా శ్రమ ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. దాని గురించి ఎదురుచూస్తాను. ఆగస్ట్ 11 తర్వాత నా వ్యక్తిగత జీవితం గురించి కాకుండా నా సినిమాల గురించి మాట్లాడతారని ఆశిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు. లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు చైతూ. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. 1994లో సూపర్ హిట్ అయిన ఫారెస్ట్ గంప్ మూవీకి రీమేక్ గా వస్తుంది ఈ సినిమా.
గతేడాది అక్టోబర్ నెలలో తామిద్దరి పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా సమంత, నాగచైతన్య ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల బంధానికి వీరిద్దరు ముగింపు పలికారు. అయితే ఇండస్ట్రీలో అన్యోన్యంగా ఉండే ఈ జంట అనుహ్యంగా విడాకులు తీసుకోవడంతో అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. వీరిద్దరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలపై నెటిజన్స్ ఎక్కువగా ఆరా తీస్తున్నారు. విడాకుల ప్రకటన అనంతరం చైతూ, సమంత వరుస చిత్రాలతో బిజీ అయ్యారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.