అసాధ్యమైన.. కష్టతరమైన ఆపరేషన్లను సుసాధ్యం చేశారు వైద్యులు. సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు మత్తుమందు ఇవ్వకుండానే వారు స్పృహలో ఉండగానే సర్జరీలు చేస్తున్నారు. గతంలో ఓ యువకుడు పియానో వాయిస్తుండగా.. బ్రెయిన్ సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోనూ అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓమహిళలకు సినిమా చూపిస్తూ ఆమె స్పృహలో ఉండగానే ఆపరేషన్ చేశారు. వివరాల్లోకెళితే.. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. రోగి స్పృహలో ఉండగానే ఎంతో కష్టమైన సర్జరీని నిర్వహించారు. ఓ మహిళ మెదడులోని కణతిని ఆమెకు సినిమా చూపిస్తూ, ఆమెతో మాట్లాడుతూ చాలా ఈజీగా తీసేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యాభై ఏళ్ల మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి, ఆమె మెదడులో కణతిని గుర్తించారు. వెంటనే ఆ కణితిని తొలగించాలని, ఆగస్టు 25న ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే ఆపరేషన్ సమయంలో ఆమె ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ట్యాబ్‌లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన అడవి దొంగ సినిమా పెట్టి అదిచూస్తుండమని ఆమెకి ఇచ్చారు. మధ్యమధ్యలో ఆమెతో మాట్లాడుతూ.. అభిమాన నటీనటుల గురించి తెలుసుకుంటూ ఆపరేషన్ కానిచ్చేశారు. ఆపరేషన్ జరుగుతుందన్న విషయం ఆమెకు అసలు గుర్తే లేకుండా చేసి మెదడులోని కణతిని విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఇలా స్పృహలో ఉండగానే రోగి మెదడుకు సర్జరీ చేసే పద్ధతిని ‘అవేక్ క్రేనియాటోమీ’ అంటారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన పీఆర్వో ఆనంద్ ను గాంధీకి పంపించి వివరాలు తెలుసుకోమన్నారు. గాంధీ సూపరింటెండెంట్ రాజారావును కలిసి.. ఆపరేషన్ చేసిన వైద్యులను కలుసుకున్నారు. అనంతరం సర్జరీ జరిగిన మహిళను కలిశారు. తాను చిరంజీవి అభిమానినని.. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నింటిని చూస్తూనే ఉన్నానని తెలిపారు. వివరాలు తెలుసుకున్న చిరు మరో రెండు మూడు రోజుల్లో గాంధీ ఆసుపత్రిని సందర్శిస్తానని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.