టాలీవుడ్‌లో ది మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జోడి ఒకటి. 2012లో పెళ్లిపీటలెక్కిన ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఎంత బిజీగా ఉన్నా తమకంటూ కొంచెం పర్సనల్ స్సేస్ కేటాయించుకుంటూ ఆదర్శంగా నిలిచారు. ఇక తమ దాంపత్య బంధానికి గుర్తింపుగా త్వరలోనే ఓ బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ లవ్లీ కపుల్. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చినట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలిపింది మెగా ఫ్యామిలీ. దీంతో మెగా కుటుంబ సభ్యులతో సహా మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా ఈ శుభవార్త విని ఎంతో ఎమోషనల్ అయ్యారట చిరంజీవి. తాను మరోసారి తాతను కాబోతున్నానని తెలిసి ఆనందంతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారట. తన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య ప్రమోషన్లలో పాల్గొన్న చిరంజీవి ఈ విషయాన్ని తెలిపారు.
‘మేం ఈ సందర్భం కోసం మేం ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి జపాన్ పర్యటన ముగించుకుని . రామ్‌చరణ్, ఉపాసన మా ఇంటికి వచ్చారు. అప్పుడే ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని మాకు చెప్పారు. ఆ వార్త విని నేను, సురేఖ ఎంతో హ్యాపీగా ఫీలయ్యాం. ఆ సందర్భంలో నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఉపాసనకు మూడో నెల వచ్చాకే ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాం’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి. కాగా ప్రస్తుతం మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కే.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మాస్ మహరాజా మరో హీరోగా నటించనున్నాడు. శృతి హాసన్ హీరోయిన్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, టీజర్లు సూపర్‌హిట్‌గా నిలిచాయి. మెగా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి