Manchu Vishnu: సైకో ట్రోల్స్ చేసేవారిపై మంచు విష్ణు ఫైర్.. ఓ నటుడే తమపై విషం చిమ్ముతున్నాడని కామెంట్స్

|

Sep 28, 2022 | 3:32 PM

ట్రోల్స్ నవ్వించేలా ఉంటే పర్లేదు కానీ.. ఎదుటివారి మనసులను గాయపడేలా ఉండకూడదన్నారు మంచు విష్ణు. తమ కుటుంబంపై ట్రోల్స్ చేయించేది ఓ నటుడే అని సంచలన ఆరోపణలు చేశారు.

Manchu Vishnu: సైకో ట్రోల్స్ చేసేవారిపై మంచు విష్ణు ఫైర్.. ఓ నటుడే తమపై విషం చిమ్ముతున్నాడని కామెంట్స్
Manchu Vishnu
Follow us on

మా ఎన్నికల టైమ్‌లోనూ, ఆ తర్వాతా మంచు విష్ణు మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. సినీ ఇండస్ట్రీలో ఎవరి మీదైనా ఆరోపణలు వస్తే… అట్నుంచి కూడా కౌంటర్ ఎటాక్ అంతే రేంజ్‌లో ఉంటుంది. MAA ఎన్నికల సమయంలో ట్రోల్స్‌ని పట్టించుకోని విష్ణు…ఆ తర్వాత కూడా ట్రోల్స్ కొనసాగుతుండడంతో సీరియస్‌ అయ్యారు. టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నటుడు జూబ్లీ హిల్స్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడని, అందులో 21 మంది ఉద్యోగులతో తన మీద పనిగట్టుకుని ట్రోల్స్ చేయిస్తున్నాడని మంచు విష్ణు ఆరోపిస్తున్నారు. సూటిగా.. సుత్తిలేకుండా అని తరచూ చెప్పే మంచు విష్ణు, ఆ ప్రముఖ నటుడి పేరు చెప్పడానికి మాత్రం మొహమాటపడ్డారు. త్వరలో బయటపెడతాన్నారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా, ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీని గుర్తించామనీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్న విష్ణు… ఆ ప్రముఖ నటుడికి సంబంధించిన సంస్థతోపాటు, మరికొందరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. త‌న కుటుంబంపై వ‌స్తున్న ట్రోల్స్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. మా ఎన్నిక‌ల‌ప్పుడు త‌న‌ను, త‌న కుటుంబాన్ని ఎంతో మంది ట్రోల్స్ చేశార‌ని, ఈ ట్రోల్స్ ఆప‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చరించారు.

మంచు విష్ణు ఆరోపించిన ఆ హీరో ఎవరనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయింది. ఇంతకీ ఆ నటుడు ఎవరు? మంచు ఫ్యామిలీతో అతనికి విభేదాలు ఉన్నాయా? లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో టాలీవుడ్‌ చెవులు కొరుక్కుంటుంది. అంతేకాదు కంపెనీ పెట్టి మరీ ఎవర్రా ఇంత పనిచేయడానికి ఒడిగట్టిందని కామెంట్‌ చేసుకుంటున్నారు. మరికొంత మంది అయితే ఇదంతా సినిమా ప్రమోషన్‌ స్టంటా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన 18 యూట్యూబ్ ఛానెల్స్ మీద కేసు వేసి వారి ఛానెల్స్‌ను బ్యాన్ చేయిస్తానని వార్నింగ్‌ ఇచ్చారు.

రూమర్స్, హీరో హీరోయిన్ల మధ్య గాసిప్స్ రావడం సహజమే.. అలాంటివి రాసుకోండి.. కానీ బతికున్నవారిని చంపేలాంటివి మానుకోండని విష్ణు హెచ్చరించారు. ట్రోల్స్ అందరిని నవ్వించేవిగా ఉండాలి కానీ ఇలా ఎదుటివారు బాధపడేలా ఉండకూడదన్నారు. ఇష్టం వచ్చిన రాతలు రాస్తూ…ట్రోల్స్‌ చేస్తున్నవారిపై సైబర్‌ పోలీసులు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకు వెళతానన్నారు విష్ణు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.