మెగాస్టార్ చిరంజీవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చిరును ఆదర్శంగా తీసుకుని చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఆయన సినిమాల్లో చిన్న పాత్ర అయినా చేయాలని.. చిరుతో కలిసి నటించాలని ఇండస్ట్రీలో చాలామంది కల. అయితే కొందరు అనుకోని కారణాలతో మెగాస్టార్ చిత్రాల్లో ఛాన్స్ వచ్చి మిస్సవుతుంటారు. అలాంటి వారిలో మలయాళీ హీరో పృథ్వీరాజ్ మిస్ అయ్యారట. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించి సూపర్ హిట్ అయిన చిత్రం సైరా నరసింహారెడ్డి. దక్షిణాది.. ఉత్తరాది పరిశ్రమ నుంచి కొంతమంది బిగ్ స్టార్స్ ఈ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్.. కన్నడ నుంచి సుదీప్…కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి.. భోజ్ పురి నటుడు రవి కిషన్ లాంటి టాప్ క్యాస్టింగ్ సినిమాలో యాడ్ అయ్యింది.
అయితే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించాలని చిరంజీవి పృథ్వీరాజ్ని అడిగారట. కానీ ఆ సమయంలో ఆయన ఆడు జీవితం సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో వీలు పడలేదని పృథ్వీరాజ్ తెలిపారట. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఆడు జీవితంను జోర్డాన్.. సహారా.. అల్జీరియా ఎడారుల్లో షూట్ చేశాం. సరిగ్గా అప్పుడే కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో చిత్రబృందంతోపాటు.. నేను కూడా జోర్డాన్లో 70 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో చిరంజీవి గారు సైరాలో అవకాశం వచ్చింది. కానీ విదేశాల్లో ఉండడంతో ఆ పాత్రకు నో చెప్పాల్సి వచ్చిందన్నారు.
ఆడు జీవితం సినిమా పృథ్వీరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్. దాదాపు 15 ఏళ్లుగా ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారు. అది ఇప్పటికీ సాధ్యమైంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నటనతో కట్టిపడేశారు పృథ్వీరాజ్. బానిస బతుకు అనుభవిస్తున్న ఓ వలస కూలీ.. ఎడారి మార్గాన తన దేశాన్ని ఎలా చేరుకున్నాడు అనేది ఈ సినిమా.