అయన నిజంగానే ఓ కాలంలో సినీ సంగీతానికి చక్రవర్తి. ఆయన పాలనలో పాటలు ఊగాయి. ఊర్రూతలూగాయి. పరుగులెత్తాయి. ఉరకలెత్తాయి. స్వరాల పల్లకీలో ఊరేగాయి. శ్రుతిలయలను సవరించుకుని సరాగమాడాయి.. అప్పుడప్పుడు చెలరేగాయి కూడా. ఆయన బాణీలు పడుచుపిల్ల ఓణి వేసుకున్నంత అందంగా వుండేవి. గడుసుపిల్ల అల్లరి చేసినంత మంద్రంగా వుండేవి. ఆయన స్వర చక్కెరవర్తి. సంగీత చక్రవర్తి. ఆయనేమో వినయంగా సంగీతానికి చక్రవర్తిని కాదు. సంగీతం చక్రవర్తిని మాత్రమేననేవారు. ఆయన అనుకున్నా అనుకోకున్నా ఆయన మట్టుకు సంగీత చక్రవర్తే. ఇవాళ ఆ సంగీత దర్శకుడి వర్దంతి.
దాదాపు పదిహేనేళ్లపాటు తెలుగు సినిమా పాటకు చక్రవర్తే (CHAKRAVARTHY)దిక్కయ్యారు. అప్పుడప్పుడు వాక్కు కూడా అయ్యారు. ఓ చేత్తో మెలోడియస్‌గా పాటను తీర్చదిద్ది. మరో చేత్తో రిథమిటక్‌గా సమకూర్చగలరు. చక్రవర్తి పేరుతోనే ఆడిన సినిమాలున్నాయి. ఏడో దశకం చివర్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్లన్నీ చక్రవర్తి సంగీతాన్ని అందించనవే! చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. బసవయ్య, అన్నపూర్ణమ్మలకు రెండో సంతానంగా జన్మించారు. అక్క హైమవతీ దేవి. తమ్ముడు కొమ్మినేని శేషగిరిరావు. పుట్టిన వూరు పొన్నెకల్లు. గుంటూరు పట్టణానికి తొమ్మిది మైళ్ల దూరంలో వుంటుందీ వూరు. స్వగ్రామంలో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న చక్రవర్తి. తాడికొండలోనూ, గుంటూరులోనూ మిగతా విద్యనంతా అభ్యసించారు. బిఎ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకోవడమే కాదు.. హిందీ విశారద, టైప్‌రైటింగ్‌లో హయ్యర్ పాసయ్యారు. చిన్నప్పుడు సంగీతం మీద అభిమానంతో కూనిరాగాలు తీస్తుండేవారు. అసలు సంగీతం పట్ల శ్రద్ధాసక్తులు పెరగడానికి ఘంటసాలే (GHANTASALA) కారణం. ఆయన పాడిన కుంతీ కుమారి పద్యాలను కంఠతా పట్టేసి రాగయుక్తంగా పాడేవారు. లలిత సంగీతానికి అర్థం చెప్పిన ఘంటసాల మాస్టారి గీతాలను సమయం దొరికినప్పుడల్లా పాడేసుకునేవారు. ఈ మోజుతోనే మహావాది వెంకటప్పయ్య దగ్గర శిష్యుడిగా చేరారు. అయినా శాస్త్రీయ సంగీతం పెద్దగా వంటపట్టలేదు. ఓ పక్క చదువు. మరో పక్క సంగీతం. జోడు గుర్రాల మీద స్వారీ చేయలేకపోయారు. అభ్యసించిన కాస్త సంగీతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గుంటూరులో వినోద్ ఆర్కెస్ట్రా స్థాపించారు. వందల కొద్దీ కచేరీలు చేశారు. సంగీత విభావరిలో సినిమా పాటలు అస్సలు పాడేవారు కాదు. అవి భక్తి గీతాలైతే తప్ప. అన్ని లలిత గీతాలే. అన్ని స్వయంగా వరుసలు కట్టిన పాటలే! చక్రవర్తి పాటలు విన్న గ్రామఫోన్ కంపెనీ మంగపతి చక్రవర్తిని ప్రయివేటు పాటలు పాడించడానికి మద్రాస్ రప్పించారు. చక్రవర్తి పాటలు విన్న సంగీత దర్శక సోదరులు రాజన్ నాగేంద్ర విఠలాచార్య సినిమాలో ఓ పాట పాడే అవకాశం కల్పించారు.పాటైతే పాడాడు కానీ వెంటనే అవకాశాలేమీ వెతుక్కుంటూ రాలేదు. ఇక లాభం లేదని పొట్ట కూటి కోసం పరిశ్రమకు చెందిన వివిధ శాఖల్లో పని చేశారు. డబ్బింగ్‌లు గట్రాలు చెప్పారు. నెల్లూరు కాంతారావు డబ్బింగ్ సినిమా సర్వర్ సుందరంలో నగేష్‌కు గాత్రదానం చేసింది మన అప్పారావే! అసలు ఆయన స్వరబలం వల్లే సినిమా వంద రోజులు పోయింది. ఆ తర్వాత నగేష్ నటించినవే కొంటెపిల్ల, నువ్వే సినిమాలొచ్చాయి కానీ రెండు పెద్దగా ఆడలేదు. కారణం వాటికి చక్రవర్తి డబ్బింగ్ చెప్పలేదు కాబట్టి.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా వున్న కాలంలోనే సత్తెనపల్లి నుంచి మిత్రబృందం చేతిలో కాస్త డబ్బులు పట్టుకుని మద్రాస్‌కొచ్చింది. చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా తీయాలన్నది వారి సంకల్పం. మిత్రుడిని దర్శకుడిగా చూడాలన్న కోరిక. ఉప్పొంగిపోయారు చక్రవర్తి. అదే రోజు రాత్రి ఛటర్జీ నుంచి పిలుపొచ్చింది. తన సినిమాకు మ్యూజిక్ చేయమని. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రాత్రి విషయమంతా భార్య రోహిణిదేవికి చెప్పేశారు. సలహా ఇమ్మని అడిగారు. దర్శకుడిగా ఫెలయితే మరో అవకాశం రావడం చాలా కష్టం. పరిశ్రమలో వున్న సెంటిమెంటది. అదే సంగీత దర్శకుడిగా ఓ పాట పాడైతే.. మరో పాటను జనరంజకం చేయవచ్చు. ఆ ఛాన్సు ఎప్పుడూ వుంటుంది. అంచేత సంగీత దర్శకుడిగానే వుంటే మంచింది. అర్ధాంగి సలహా ఇది. ఆమె చెప్పినట్టుగానే ఛటర్జీకి ఓకె చెప్పేశారు. అలా మూగప్రేమతో మ్యూజిక్ డైరెక్టరైపోయారు అప్పారావు. అప్పట్నుంచి అప్పారావు కాస్తా చక్రవర్తి అయ్యారు. ఈ సినిమాలో కళావతి రాగంలో స్వరపరచిన ఈ సంజెలో కెంజాయిలో అనే పాటను ఇప్పటికీ సంగీతాభిమానులు పదే పదే గుర్తు చేసుకుని మురిసిపోతుంటారు. అరవై ఎనిమిదిలో భలే గూఢచారి అనే డబ్బింగ్ సినిమా వచ్చింది. అందులో కల్యాణిలో కంపోజ్ చేసిన లోకులంతా చూస్తారుగా రాజా అనే పాట పది మంది దృష్టిలో పడేందుకు దోహదపడింది. ఎంఎస్ రెడ్డి డబ్బింగ్ సినిమా కన్నెపిల్లకి కూడా చక్రవర్తి సంగీతాన్ని అందించారు. మూగప్రేమ తర్వాత చక్రవర్తికి తిరుగులేకుండా పోయింది. శారద సినిమాతో విఖ్యాతి గడించారు. ఇదాలోకంతో పూర్తిగా బిజీ అయిపోయారు.
చక్రవర్తికి బాణీలు కట్టడం హార్మనియం మెట్ల మీద వేళ్లాడించినంత సులువు. పాటకు పట్టుమని పది నిమిషాలు కూడా తీసుకునేవారు కాదు. అందుకే వేన వేల పాటలకు అవలీలగా ట్యూన్లు కట్టారు. అవి కూడా పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా. మూడ్ అంటూ రావాలే కానీ చక్రవర్తిని బాణీలు కట్టడం లెక్క కాదు. అయిదు నిమిషాల్లో వరసలు కట్టగలరు. గంటలో కంప్లీట్ చేయగలరు. ప్రేమాభిషేకం సినిమాలోని తారలు దిగివచ్చిన వేళ, వందనం అభివందనం, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, నా కళ్లు చెబుతున్నాయి పాటలను కేవలం ఒకే ఒక్క రాత్రిలో కంపోజ్ చేశారు. ఇలాంటి ఫీట్లు చేయడం కేవలం చక్రవర్తికి మాత్రమే సాధ్యం.
అవి మల్లెపువ్వు మ్యూజిక్ సిట్టింగ్ నాటి రోజులు. పాట రచన కోసం వేటూరి సుందరరామమూర్తి (VETURI) స్వర రచన కోసం చక్రవర్తి తెగ ప్రయత్నిస్తున్నారు. అప్పటికీ పన్నెండు రోజులు గడిచాయి. ఓ పదిహేను పాటలను ప్రయత్నించి చూశారు. సందర్భానికి తగినట్టు ఒక్కకంటే ఒక్కటి కూడా రావడం లేదు. వేటూరికి విసుగొచ్చేసింది. ఛస్ ఒక్క చిన్నముక్క కూడా రావడం లేదు అని బాధపడ్డారు. అదే ముక్కని పేపర్ మీద పెట్టి చూడండి గురువుగారు అన్నారు చక్రవర్తి. చిన్న ముక్క చిన్న ముక్క అని రాసుకున్నారు వేటూరి. నిమిషం పాటు ఇద్దరు మొహాలు చూసుకున్నారు. ఇద్దరి మొహాల్లో చిరువదనం. వేటూరి వెంటనే దాన్ని మార్చి చిన్న మాట-ఒక చిన్నమాట అన్నారు. ఎగిరి గంతేశారు చక్రవర్తి. అంతే పాట తయారైంది. సరిగ్గా గంటలో ట్యూన్ కూడా అయింది.
శాస్త్రీయ సంగీతంలో కాకలు తీరకపోయినా రాగాలతో చక్రవర్తి చేసిన ప్రయోగాలు అనన్య సామాన్యాలు. మోహన అనగానే మనకు టక్కున ఇదాలోకం లోని నీ మనసు నా మనసు ఏకమై పాట గుర్తుకొచ్చి తీరుతుంది. అలాగే మాల్‌కౌస్.. అదే హిందోళమంటే చాలు…జేబుదొంగలోని రాధా అందించు నీ లేత పెదవి పాట అసంకల్పితంగానే పెదవులై మెరుస్తుంది. భీంప్లాస్‌లో శ్రీమతి గారికి తీరని వేళ .. కుశలమా నీకు కుశలమేనా పాటలు గుర్తుకు రాకుండా వుండవు. యమన్ కళ్యాణ్‌లో మన్నించుమా ప్రియా, మాల్‌కౌస్, జయజయావంతి, చారుకేశి, సారంగ రాగాలలో ఆడవే అందాల సురభామిని.. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే వుండదు.
చక్రవర్తి నిండు కొలనులాంటి వాడు. చవిటి పర్రల్లో హరితశాద్వలాల్లో కొండకోనల్లో యధేచ్ఛగా ఒరుసుకుంటూ తన ఉరవడిలో అవరోధాలను పక్కకు జరుపుకుంటూ చిమ్మకుపోయే ఏరులాంటివాడు.. ఔపమ్యంతో పని లేదు. అతణ్ణి చూస్తూనే తెలుస్తుంది.క్షణమైనా నిలువని ప్రవాహలక్షణం కలవాడని అంటారు డాక్టర్ సి.నారాయణరెడ్డి చక్రవర్తి గురించి. ఆయన పాటలు వింటే సినారే మాటలు నిజమేననిపిస్తాయి. సెవంటీఫైవ్‌లో తీర్పు అనే సినిమా వచ్చింది. యు.విశ్వేశ్వరరావు తీశారీ సినిమాను. ఇందులో విధాత వేళ అనే పాటుంది. చాలా అద్భుతమైన కంపోజిషన్. ఈ పాటకు చక్రవర్తి వాడింది కేవలం నాలుగు వాయిద్యాలే. నిజంగానే నాలుగే వాయిద్యాలు. పాట చాలా గొప్పగా ఉంటుంది. దటీజ్ చక్రవర్తి. చారుకేశి రాగాన్ని పాపులర్ చేసింది చక్రవర్తే. అసలు ఈ రాగాన్ని మాస్టర్ వేణుగారు తప్ప ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ రాగాన్ని అంటుకోడానికి సాహసించలేదు. చక్రవర్తి చాలా పాటలను ఇందులో కంపోజ్ చేసి భేష్ అనిపించుకున్నారు. ఏటి ఒడ్డున నిలుచుంటే పాట ఒక్కటి చాలు.. చక్రవర్తికి చారుకేశి మీదున్న పట్టును తెలియచెప్పటానికి.
చక్రవర్తి పుట్టిన రోజున ఆత్రేయ ఆయన్ని పాపాత్ముడన్నారు. అయ్యా… ఆ మాట ఎందుకన్నారని అడిగితే.. సమాసం తప్పయినా సామ్యం ఒప్పుతుంది కనుక ఆ మాటన్నాను. చక్రవర్తి పాప లాంటి ఆత్మ కలవాడు అని జవాబిచ్చారు ఆత్రేయ. ఆయన అన్నట్టుగానే చక్రవర్తిది నిండు మనసు. పది మంది మంచి కోరే వ్యక్తి. మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా వున్న సమయంలోనూ చక్రవర్తి చాలా మంది నటులకు స్వరాన్ని అరువిచ్చారు. ఊర్వశిలో సంజీవ్ కుమార్‌కి, కల్పనలో వరప్రసాద్‌కి.. మన్మథలీల, ప్రేమపూజారిలలో కమల్‌హాసన్‌కి(KAMALHASAN), ప్రేమలేఖలులో అనంత్‌నాగ్‌కి.. ఆమెకథలో రజనీకాంత్‌కి, సీతాకల్యాణంలో రాముడి పాత్ర వేసిన రవికి, మనీలో పరేష్ రావల్‌కి చక్రవర్తే డబ్బింగ్ చెప్పాడు. అంతే కాదు తన నటనాపటిమతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగలిగారు. గోపాలరావుగారి అమ్మాయిలో చెవిటి లాయర్‌గా, పక్కింటి అమ్మాయిలో సంగీత మాస్టారిగా, ఆమెకథలో బీమా ఏజెంట్‌గా, అల్లరి బుల్లోడులో రేషన్ ఆఫీసర్‌గా, సీతాపతి సంసారంలో తిండిపోతు ఆఫీసర్‌గా, అతనికంటే ఘనుడులో మోటార్ షాపు యజమానిగా, గజదొంగలో కానిస్టేబుల్‌గా చక్రవర్తి చక్కగా నటించారు.
చక్రవర్తి సంగీతం ఛందోరాహిత్యంలో ఛందస్సును సృష్టించుకున్న సహజ సాహిత్యం వంటిది. సాహిత్య రాహిత్యంలో సరస హృదయాలను అలరింపగల ఆమని కోయిన తీయని పిలుపు వంటింది… ఈ మాటన్నది వేటూరి సుందరరామమూర్తి. వేటూరి కలం బలమేమిటో చక్రవర్తికి తెలుసు. చక్రవర్తి మ్యూజిక్ పవరేమిటో వేటూరికి తెలుసు. అందుకే ఆ ద్వయం క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా పాటలందించాయి. వేటూరి గడుసరి పాట పిల్లకు సరైన మొగుడు చక్రవర్తే. దర్శకుడి ఆలోచనాసరళికి అనుగుణంగా పాట రూపుదిద్దుకునేది. రాఘవేంద్రరావు (RAGHAVENDRA RAO) సినిమాల్లోని పాటలు ఓ రకంగా వుంటే జంధ్యాల సినిమాల్లోని పాటలు మరో రకంగా వుండేవి. విశ్వనాథ్ సినిమా పాటలు ఇంకో రకంగా ఉండేవి.
ఎనిమిదో దశకం మధ్య వరకు అప్రతిహతంగా సాగిన చక్రవర్తి జైత్రయాత్రకు ఒక రకంగా ఇళయరాజా అడ్డుకట్ట వేశాడనే చెప్పుకోవచ్చు. వెయ్యి సినిమాలన్నా పూర్తి చేయాలన్నది చక్రవర్తి కోరిక. ఆ కోరిక తీరకుండానే చక్రవర్తి వెళ్లిపోయారు. ఇప్పుడాయన సురభామినుల లాస్యానికి తగినట్టుగా బాణీలు కడుతూ హాయిగా వున్నారు.
Also Read: