Naatu Naatu Song: నాటు నాటు పాట షూటింగ్‌‌లో ఎన్నో ప్రత్యేకతలు.. అవేంటో తెలుసా..?

ఆగస్టు 2021లో కొవిడ్‌ ఆంక్షలు సడిలించిన సమయంలో సినిమా బృందమంతా కీవ్‌ వెళ్లి అక్కడ ఆ పాట షూట్‌ చేసింది. వాస్తవానికి నాటు నాటు సాంగ్‌ను ఇండియాలోనే షూట్‌ చేయాలనుకున్నారు.

Naatu Naatu Song: నాటు నాటు పాట షూటింగ్‌‌లో ఎన్నో ప్రత్యేకతలు.. అవేంటో తెలుసా..?
Naatu Naatu Song Making

Updated on: Mar 13, 2023 | 7:39 PM

ప్రపంచం మెచ్చిన నాటు నాటు పాట షూటింగ్‌ ఎక్కడి జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. యుద్ధంతో ప్రస్తుతం అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌లో ఈ పాట షూటింగ్‌ జరిగింది. ఆ పాటలో కనిపించే భవనం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ఆ దేశ అధ్యక్షుడి భవనం. ఆగస్టు 2021లో కొవిడ్‌ ఆంక్షలు సడిలించిన సమయంలో సినిమా బృందమంతా కీవ్‌ వెళ్లి అక్కడ ఆ పాట షూట్‌ చేసింది. వాస్తవానికి నాటు నాటు సాంగ్‌ను ఇండియాలోనే షూట్‌ చేయాలనుకున్నారు. కాని ఆ సమయంలో ఇక్కడ వర్షాకాలం కావడం, విపరీతంగా వర్షాలు కురుస్తుండటంతో లొకేషన్‌ కోసం అనేక ప్రాంతాలు వెదికారు. ఇండియాలో ఎక్కడ సెట్‌ వేసినా వర్షానికి పాడయ్యే పరిస్థితి ఉండటంతో సినిమా బృందం రాజీపడలేదు. ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనానికి ఉన్న రంగులు, దాని ముందున్న ఖాళీ ప్రదేశం అన్ని విధాలుగా నాటు నాటు పాటకు సరిపోతుందని సినిమా బృందం భావించింది. అధ్యక్ష భవన ముందు షూటింగ్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కాని. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సినిమా పరిశ్రమంతో సంబంధం ఉన్న వ్యక్తి కావడంతో నాటు నాటు పాటకు ఈజీగానే అనుమతి లభించింది. ఈ పాట కోసం ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనం రంగులు, డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ కాకముందు టీవీ ఆర్టిస్ట్‌గా పనిచేశారు జెలెన్‌స్కీ. ఈ పాటలో ఒక చోట ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ భవనం డోమ్‌ కూడా కనిపిస్తుంది.

నాటు నాటు పాట కోసం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ విపరీతంగా కష్టపడ్డారు. స్టెప్స్‌ పర్ఫెక్షన్ విషయంలో రాజమౌళి ఏక్కడా రాజీపడలేదని స్వయంగా రామచరణ్‌, ఎన్టీఆర్‌ చెప్పారు. అన్నట్టు ఈ పాటం కోసం కొరియోగ్రాఫర్‌ ప్రేమ్ రక్షిత్ వందకు పైగా స్టెప్స్‌ కంపోజ్‌ చేశారు. అందులో కొన్ని స్టెప్స్‌ను రాజమౌళి ఎంపిక చేశారు.

నాటు నాటు పాటలో కనిపించే భవనం పేరు మరిన్‌స్కీ ప్యాలెస్‌. 1744లో అప్పటి రష్యా మహారాణి ఎలిజబెత్‌ పెట్రోవ్నా ఆదేశాలపై దీన్ని నిర్మించారు. ఆ కాలంలో ఎంతో పేరున్న ఆర్కిటెక్ట్ బార్టోలోమియో రస్ట్రెల్లి ఈ భవన డిజైన్‌ రూపొందించారు. 1752లో ఇది పూర్తైంది. అంటే దీని నిర్మాణానికి 8 సంవత్సరాలు పట్టింది. అయితే అప్పటికే మహారాణి ఎలిజబెత్‌ కన్నుమూశారు. మహారాణి మేనకోడలు క్యాథరిన్‌ టూ ఇందులో కొన్నాళ్లు నివాసం ఉన్నారు. 18వ శతాబ్దం, 19వ శతాబ్దంలో ఎక్కువ భాగం ఇది గవర్నర్స్‌ జనరల్‌ నివాసంగా కొనసాగింది.

19వ శతాబ్దంలో దాదాపు 50 ఏళ్ల పాటు ఈ భవనం ఏదో ఒక సందర్భంలో తగలబడిపోయింది. 1834 నుంచి 1868 వరకు ఈ భవనంలో ఒక మినరల్‌ వాటర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించింది. 1870 లో రష్యా చక్రవర్తి అలెగ్జాండర్‌ టూ – ఈ అంతపురాన్ని పునర్‌నిర్మించారు. పాత డ్రాయింగ్స్‌ ఆధారంగా వాటర్‌ కలర్స్‌ను బట్టి ఆర్కిటెక్ట్‌ కొన్‌స్టాన్‌టిన్‌ మెయేవిస్కీ భవనానికి ప్రస్తుత ఆకృతి తీసుకొచ్చారు. అప్పటి మహారాణి మరియా అలెగ్జాండ్రోవా పేరు మీద ఈ భవనానికి మరిన్‌స్కీ ప్యాలెస్‌గా నామకరణం చేశారు. ఆమె కోరిక మీదే భవనానికి దక్షిణం వైపు పెద్ద పార్క్‌ ఏర్పాటు చేశారు. మాస్కో నుంచి వచ్చే రాజకుటుంబీకులకు ఈ భవనం 1917 వరకు విడిదిగా ఉపయోగపడింది.

రష్యా పౌరయుద్ధం సమయంలో ఇది విప్లవ సంస్థ కీవ్‌రెవ్‌కామ్‌కు ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. 1920లో ఈ భవనంలో ఒక వ్యవసాయ పాఠశాల పనిచేసింది. ఆ తర్వాత కొంత కాలానికి ఇది మ్యూజియంగా మారింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ భవనం బాగా దెబ్బతింది. 1940 చివర్లో దీన్ని పునరుద్ధరించారు. 1980లో మరోసారి దీన్ని మార్చారు.