తొలితరం మహానటి ఈవిడ.. చివరి రోజుల్లో కన్నీళ్లతో సహవాసం.. కన్నాంబ జీవితంలోని కోణాలు
పసుపులేటి కన్నాంబ, మూడు దశాబ్దాల పాటు దక్షిణాదిన తిరుగులేని నటిగా ఒక వెలుగు వెలిగారు. రంగస్థలం నుంచి చిత్రసీమకు వచ్చి, తెలుగు, తమిళ భాషల్లో సుమారు 200 చిత్రాల్లో నటించారు. ఆమె నటన, కంఠం, సంభాషణలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ..

పసుపులేటి కన్నాంబ, భారతీయ చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. 1934 నుంచి మూడు దశాబ్దాల పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమను తన అభినయంతో, కంఠంతో, పట్టుదలతో ఏలిన మహానటి ఆమె. సెప్టెంబర్ 20, 1912న ఏలూరులో జన్మించిన కన్నాంబ, చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. అయితే, నృత్య కళాకారుల పట్ల సమాజం చూపిన వైఖరి నచ్చక, జీవితంలో మళ్లీ కాలికి గజ్జె కట్టనని శపథం చేశారు. తన 13వ ఏట ఏలూరులోని నవల నాటక సంఘంలో చేరి రంగస్థలంపై అడుగు పెట్టారు. సావిత్రి, అనసూయ, ప్రహ్లాద వంటి నాటకాలలో నటించి మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆమె కంచు కంఠంతో పద్యాలు పాడితే ప్రేక్షకులు మౌనం వహించి, పూర్తవగానే వన్స్ మోర్ కేకలతో హాలు దద్దరిల్లేది. ఆ రోజుల్లోనే తన రాజరాజేశ్వరి దేవి భక్తితో రాజరాజేశ్వరి దేవి నాటక సమాజం నెలకొల్పి ఆంధ్రదేశమంతటా ప్రదర్శనలు ఇచ్చారు. కడారు నాగభూషణం ఆమె జీవితంలోకి ప్రవేశించి ఈ సమాజం నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 1935లో స్టార్ కంబైన్స్ నిర్మించిన హరిశ్చంద్ర సినిమాతో కన్నాంబ సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రంలో శోకరసంతో కూడిన ఆమె పద్యాలు, పాటలు, సంభాషణలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. మొదటి చిత్రంతోనే విజయం సాధించిన కన్నాంబ వెనుతిరిగి చూడలేదు. ద్రౌపది వస్త్రాపహరణం (1936), కనకతార (1937) వంటి విజయాలతో స్టార్ హీరోయిన్‌గా మారారు. 1938లో వచ్చిన గృహలక్ష్మి చిత్రానికి ఆమె పెట్టుబడి పెట్టి, మూడింతల లాభాన్ని పొందారు.
కన్నాంబ విశాల నేత్రాలు కరుణ రసాన్ని, క్రోధ రసాన్ని అద్భుతంగా పలికించగలవు. ఆమె మంచి భాష, భావం, స్పష్టమైన ఉచ్చారణకు ప్రసిద్ధి. అక్షరం పొల్లుపోకుండా స్క్రిప్ట్‌లో రాసిన డైలాగులను చెప్పగల తొలి నటి ఆమె. సినీ రంగంలోకి ప్రవేశించిన తొలి రోజుల్లో తమిళం రాకపోయినా, పట్టుదలతో నేర్చుకుని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నటించారు. అప్పట్లో డబ్బింగులు లేని రోజుల్లో, ఒక షాట్ తెలుగులో తీసిన వెంటనే తమిళంలో అదే భావంతో డైలాగులు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేవారు. 1940లో వచ్చిన చండిక చిత్రంలో హీరోయిన్‌గా గుర్రపు స్వారీ నేర్చుకోవడమే కాకుండా, దక్షిణాది నటీమణులలో క్రూర జంతువులతో కలిసి నటించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. పులులతో చాలా కాలం గడిపి, స్వయంగా వండి పెట్టి వాటిని మచ్చిక చేసుకున్నారు. 1941లో కన్నాంబ, నాగభూషణం దంపతులు రాజరాజేశ్వరి ఫిలిమ్స్ సంస్థను స్థాపించి తల్లి ప్రేమ, సుమతి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. నాగభూషణం ఈ చిత్రాలతో దర్శకుడిగా మారారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం విరామం తీసుకున్న కన్నాంబ, 1945లో మళ్ళీ పుంజుకుని ఏకకాలంలో మూడు చిత్రాల్లో నటించారు. సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం వంటి చిత్రాలు ఆమె నిర్మాణ సంస్థకు మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చాయి. తన అల్లుడు సి.ఎస్.రావుని దర్శకుడిగా పరిచయం చేశారు.
వ్యక్తిగత జీవితంలో కన్నాంబ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాను సినిమాల్లో సంపాదిస్తుంటే, భర్త సినిమాలను నిర్మించి నష్టపోతున్నారని సన్నిహితుల దగ్గర వాపోయేవారు. సంతానం లేకపోవడంతో ఒక అమ్మాయిని పెంచుకొని, ఆమెను దర్శకుడు సి.ఎస్.రావుకి ఇచ్చి వివాహం చేశారు. అయితే, సి.ఎస్.రావు రాజసులోచనతో ప్రేమలో పడి, ఆమెకు విడాకులు ఇవ్వడం కన్నాంబ దంపతులకు తీరని ఆవేదన కలిగించింది. అయినప్పటికీ, ఆమె తన దాతృత్వాన్ని వీడలేదు. సినిమా మోజుతో మద్రాసు వచ్చిన ఎంతోమందికి ఆశ్రయం కల్పించి, అన్నం పెట్టి ఆదుకున్నారు. కన్నాంబకు తెలుగు చిత్ర పరిశ్రమలో తగినంత గౌరవం లభించకపోయినా, తమిళ చిత్ర పరిశ్రమ ఆమెను ఎంతగానో ఆదరించింది. 1960లో ప్రతిష్టాత్మకమైన కలైమామణి అవార్డుతో సత్కరించడమే కాకుండా, 2005లో ఆమె పేరుతో పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్., ఎస్.వి.ఆర్. వంటి మహానటులు ఆమె నిర్మించిన చిత్రాల్లో నటించారు. దక్షయజ్ఞం వంటి చిత్రాల్లో ఆమె నట విశ్వరూపాన్ని చూడవచ్చు. మగవాళ్ళలో ఎస్.వి.ఆర్., ఆడవాళ్ళలో కన్నాంబ అనే నానుడి ఆమె ప్రతిభకు నిదర్శనం.
29 ఏళ్ల నట జీవితంలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 200 చిత్రాల్లో నటించిన కన్నాంబ, 1964 మే 7న తన 52వ ఏట హఠాత్తుగా కన్నుమూశారు. రామదాసు చిత్రంలో చివరి సన్నివేశం మిగిలి ఉండగానే ఆమె మరణం సంభవించింది. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆమె భర్త కడారు నాగభూషణం 1976 అక్టోబర్ 18న ఆర్థిక ఇబ్బందులతో కన్నుమూశారు. కన్నాంబ తన నటనతో తెలుగు, తమిళ చిత్రసీమలో ఒక శకానికి నాంది పలికిన మహానటి. ఆమె నటించిన చిత్రాలు నేటికీ ఆమెను మన ముందు నిలుపుతాయి.
(ఈ సమాచారం వెటరన్ ఫిల్మ్ జర్నలిస్టుల నుంచి సేకరించాం)
