
పునీత్ రాజ్ కుమార్.. కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. అలనాటి సీనియర్ హీరో రాక్ కుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పునీత్.. తక్కువ సమయంలోనే అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్ కన్నుమూశారు. ఆయన మరణాన్ని ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం హీరోగానే కాదు ఎన్నో సేవాకార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చిరంజీవిగా నిలిచారు పునీత్. 46ఏళ్ళు వయసులోనే పునీత్ తిరిగిరాని లోకానికి వెళ్లడం ఆయన అభిమానులను కలిచివేసింది.
బాలనటుడిగా పలు సినిమాల్లో అలరించిన పునీత్.. అప్పు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. అప్పు నటుడు మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. నిర్మాత, సింగర్, బుల్లి తెరపై హోస్ట్ గా కన్నడ ప్రజలను అలరించారు పునీత్. ఓ వైపు వెండి తెరపై నటుడిగా అలరిస్తూనే.. మరో వైపు ఎన్నో సామజిక కార్యక్రమాలను కూడా చేపట్టారు. 45 ఉచిత పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలల, 1800 మంది విద్యార్ధులకి ఉచిత విద్యను అందించి ప్రజల మనస్సులో చిరంజీవిలా నిలిచారు. ప్రజలు ఎంతగా పునీత్ ని అభిమానిస్తున్నారంటే.. రోజూ వేల మంది ఆయన సమాధిని దర్శించుకుంటున్నారు. అంతేకాదు.. ఆ మధ్య ఓ ప్రేమికుల జంట.. బళ్లారి నుంచి కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్ద వెళ్లి.. అక్కడ పెళ్లి చేసుకున్నారు.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డుతో కర్ణాటక ప్రభుత్వం సత్కరించింది. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పలువురు అభిమానులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు యూనివర్సిటీ బీకాం సిలబస్ లోని వాణిజ్య కన్నడ 3 అనే పాఠ్యపుస్తకంలో పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు దాంతో పునీత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.